Site icon NTV Telugu

దసరా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’దే !

Tollywood

ఈ దసరాకు ఏకంగా మూడు సినిమాలు ఒకేసారి పోటీలో నిలిచాయి. దసరా సీజన్‌లో “పెళ్లి సందD”, “మహా సముద్రం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రాలు మూడు సినిమాలు వచ్చాయి. అక్కినేని అఖిల్, సిద్ధార్థ్, శర్వానంద్, రోషన్… వీరందరికీ కూడా హిట్ ముఖ్యం. అయితే ముగ్గురు హీరోల సినిమాలూ ఒకేసారి విడుదలయ్యాయి. అందులో దసరాకు సందడి చేసిన సినిమా మాత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ బొమ్మ హిట్టు
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు 6 కోట్లకు పైగా షేర్ సాధించింది. వారాంతంలో ఈ చిత్రం కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయి. అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 24 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా దసరా విజేతగా నిలిచి అఖిల్‌కి మంచి హిట్ ఇచ్చింది. దీనికి ముఖ్య కారణం సంగీతం, రొమాన్స్, పూజాహెగ్డే గ్లామర్ అని చెప్పొచ్చు. ‘లెహరాయి’ అంటూ సిద్ శ్రీరామ్ పాడిన పాటతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అప్పుడే అందరి దృష్టిలో ఇది రొమాంటిక్ మూవీ అన్న ముద్ర పడిపోయింది. దీంతో యూత్ అంతా ఈ సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూశారు. దాని ఫలితమే సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావడానికి కారణమైంది.

Read Also : ఇంట్రెస్టింగ్ వీడియోతో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్

కెరటంలా ఎగసి పడిన ‘మహా సముద్రం’
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “మహా సముద్రం”. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ కూడా అక్టోబర్ 14నే థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలకు ముందు నుంచే భారీ హైప్ ఉండడంతో మొదటి రోజు బాగానే కలెక్షన్లు వచ్చాయి. కానీ సినిమా విడుదలయ్యాక రెండవ రోజు నుంచి ఆక్యుపెన్సీ పడిపోయింది. వారాంతంలో కూడా కలెక్షన్లపరంగా పెద్దగా పుంజుకోలేదు. ఈ సినిమా శర్వా, సిద్ధార్థ్, దర్శకుడు అజయ్ భూపతికి బాక్సాఫీస్ నిరాశను మిగిల్చింది. నిజానికి ఈ సినిమా గురించి అజయ్ భూపతి చాలా కష్టపడ్డాడు. ఎంతోమంది హీరోలను కలిసి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ నిరాశ పడకుండా ప్రయత్నించి అదే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఫలితం మాత్రం ఆయన మొదటి సినిమాల లేదనే చెప్పాలి.

‘పెళ్లి సందD’ సందడి పర్లేదు !
ఈ చిత్రంతో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శ్రీలీలకు ఇదే మొదటి చిత్రం. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు పాజిటివ్ బజ్ వచ్చింది. సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. యావరేజ్ గా నిలిచిన ఈ సినిమాకు పాటలు, మ్యూజిక్ సహాయం చేశాయని చెప్పొచ్చు. రెండవ రోజు నుండి ఆక్యుపెన్సీ పెరిగింది. వారాంతంలో మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్‌గా కలెక్షన్లు రాబడుతోంది.

Exit mobile version