ఒక స్టార్ హీరో సినిమా ఓటీటీలో వస్తుందంటే ఫ్యాన్స్ థియేటర్ రిలీజ్ కావాలని హంగామా చేయటం మనం చూస్తూ ఉన్నాం. అదీ కాక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో ఆ యా భాషల్లో ఓ మోస్తరు సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఐదు సినిమాలు ఏకంగా ఓటీటీలోనే రాబోతుండటం టాక్ ఆఫ్ ద నేషన్ అవుతోంది. అంతే కాదు అందులో బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ ‘మరక్కర్: అరబికాడలింటే సింహం’ కూడా ఉండటం విశేషం. ఈ చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబూర్ ‘మరక్కర్’ను త్వరలో ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా మార్చి 26, 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కానీ కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ల వల్ల విడుదల ఆగింది. ఇక ప్రస్తుతం ఓటీటీలో విడుదలకు 21 రోజుల ముందే థియేటర్ లో విడుదల చేయాలని నిర్మాత ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపాడు. అయితే అవి విఫలమయ్యాయి. దీంతో సినిమాను డైరెక్ట్‌గా డిజిటల్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్‌తో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంటోనీ చెబుతున్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్క ‘మరక్కర్’ మూవీనే కాదు ఆంటోనీ సహాయసహకారాలతో రూపొందుతున్న మరో నాలుగు మోహన్‌లాల్ సినిమాలు కూడా డైరెక్ట్ గా డిజిటల్ లోనే విడుదల కాబోతున్నాయి. అవేంటంటే ‘బ్రో డాడీ, 12వ వ్యక్తి, అలోన్’ తో పాటు వైశాఖ్ దర్శకత్వంలో పేరు పెట్టని సినిమా కూడా ఓటీటీలోనే రాబోతున్నాయట. దీంతో అధికారికంగా అత్యధికంగా డైరెక్ట్ గా ఓటీటీలో ఎక్కువ సినిమాల విడుదల ఉన్న స్టార్ హీరోగా మోహన్ లాల్ నిలిచారు. మోహన్ లాల్ నటించిన గత చిత్రం ‘దృశ్యం 2’ కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ విడుదల అయింది అన్నది ముఖ్యం కాదు. జనాదరణ పొందిందా? లేదా? అన్నది ముఖ్యం. మరి రాబోయే మోహన్ లాల్ సినిమాలలో ఎన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయో చూద్దాం.
ఓటీటీలో మోహన్‌లాల్ 5 సినిమాలు
