Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. రెండు రోజుల్లోనే అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్!

Mirzapur The Movie 300kb

Mirzapur The Movie 300kb

Mirzapur: The Movie: ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే పాత్ర కలీన్ భయ్యా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ క్రైమ్ డ్రామా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే క్రేజ్‌ను థియేటర్లలో కొనసాగించేందుకు ‘మీర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) సిద్ధమవుతోంది. వెబ్ సిరీస్‌లోని పాత్రలు, కథా ప్రపంచాన్ని వెండితెరపై మళ్ళీ చూడాలని ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 4న ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన చూస్తే సినిమాపై ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

‘మీర్జాపూర్: ది మూవీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 31న ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ మొదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో టికెట్ అమ్మకాలు వేగంగా సాగుతున్నాయి. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, కేవలం 24 గంటల్లోనే ఈ సినిమాకు సంబంధించిన 38,460 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ మూవీ దేశవ్యాప్తంగా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దీనికి ఉన్న క్రేజ్, కృష్ణాష్టమి సెలవు దినం కలిసి రావడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 15 నుండి 20 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ విజయమే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది. కలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా త్రిపాఠి వంటి పాత్రలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాయి. వెబ్ సిరీస్‌లోని క్రైమ్, పవర్ పాలిటిక్స్, యాక్షన్, కుటుంబ వైరుధ్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే ప్రపంచాన్ని పెద్ద తెరపై మరింత గ్రాండ్‌గా చూపించబోతుండటంతో అభిమానుల్లో ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడుతోంది. ‘మీర్జాపూర్: ది మూవీ’లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ వంటి నటులు కనిపించనున్నారు. వీరితో పాటు రవి కిషన్, జితేంద్ర కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది.

‘మీర్జాపూర్: ది మూవీ’ 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో హిందీతో పాటు తెలుగు, తమిళం కన్నడ భాషల్లో విడుదల కానుంది.  థియేట్రికల్ రన్ ముగిసిన 8 వారాల తర్వాతే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. రిలీజ్ కు ఇంకా సమయం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఈ స్థాయిలో సాగుతుండటంతో మేకర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వెబ్ సిరీస్ క్రేజ్‌ను ఈ సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకుంటుంది? థియేటర్లలో కలీన్ భయ్యా మరోసారి ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకుంటాడా? ఈ అడ్వాన్స్ బుకింగ్ జోరు ఓపెనింగ్ డే బాక్సాఫీస్ వద్ద కూడా కొనసాగుతుందా ? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.