NTV Telugu Site icon

Megastar Chiranjeevi: దండేసి గొర్రె పొట్టెల్ని బలికి తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారు

Chiranjeevi Speech

Chiranjeevi Speech

Megastar Chiranjeevi Talks About His Marriage In Allu Ramalingaiah Centenary Celebrations: పార్క్ హయత్‌లో నిర్వహించిన అల్లు రామలింగయ్య శయజయంతి & పుస్తకావిష్కరణ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి నవ్వులు పూయించారు. అల్లు రామలింగయ్యతో తనకు పరిచయం ఎలా ఏర్పడిందో వివరిస్తూనే.. సురేఖతో ఎలా పెళ్లి అయ్యిందన్న వివరాల్ని చాలా కామెడీగా వర్ణిస్తూ వచ్చారు. అల్లు రామలింగయ్య నడిచే ఒక ఎన్‌సైక్లోపీడియా అని, ఆయనతో తనకెంతో అనుబంధం ఉందంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత తన పెళ్లి గురించి ప్రస్తావించారు. 1998లో మన ఊరి పాండవులు సినిమా షూటింగ్‌లో ఆయనతో తనకు తొలి పరిచయం ఏర్పడిందని అన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన తన మీద ప్రత్యేక దృష్టి సారించారని.. ఒక నటుడిగా తనని అబ్జర్వ్ చేస్తున్నారేమోనని అనుకున్నానని, కానీ ఆయనలో ఇంకో కోణం ఉందన్న విషయాన్ని తాను గమనించలేకపోయానని అన్నారు.

ఒకరోజు ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు అల్లు రామలింగయ్య మందేసిన తర్వాత తనని పిలిచి ‘మందేస్తావా’ అని అడిగారని చిరు అన్నారు. అయితే.. తాను ఆంజనేయ స్వామి భక్తుడినని, మందు తాగనని అన్నానని తెలిపారు. అప్పుడాయన ఒక టిక్ వేసుకున్నారన్నారు. రెండు, మూడు షెడ్యూల్స్ చేసిన తర్వాత యూనిట్ సభ్యులందరూ ఒక అమ్మాయితో సరదాగా ముచ్చటిస్తుంటే, తాను మాత్రం హార్స్ రైడింగ్ చేస్తున్నానని.. అప్పుడు తాను అమ్మాయిలతో కాస్త దూరంగానే ఉంటానన్న సంగతిని అల్లు రామలింగయ్య గమనించారని అన్నారు. అక్కడొక ఇంకో టిక్ వేసుకున్నారన్నారు. ఇలా తనని బాగా గమనించాక.. అల్లు రామలింగయ్య, నిర్మాత జయక్రిష్ణ, అల్లు అరవింద్ కలిసి తన పెళ్లి గురించి స్కెచ్ వేసుకున్నారన్నారు. జయకృష్ణ వచ్చి తనని పెళ్లి గురించి అడిగితే.. అప్పుడే పెళ్లేంటి? ఇంకా ఆరు, ఏడు ఏళ్లు అవుతుంది? ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టంతా అని తాను సమాధానం ఇచ్చానన్నారు. అప్పుడు ఇలా అయితే కుదరదనుకొని.. తన తండ్రి దగ్గరికి జయకృష్ణ వెళ్లి పెళ్లి గురించి మాట్లాడారని చిరు తెలిపారు.

ఇండస్ట్రీలో అమ్మాయిలు సరిగ్గా లేరు, ఎవరైనా కన్నేసి మన అబ్బాయిని బుట్టలో పడేసుకుంటారు, ఆ తర్వాత మన అబ్బాయి మన చేతికి చిక్కడు, కాబట్టి ఇప్పుడే పెళ్లి చేయడం కరెక్ట్, మనకు తెలిసిన ఒక మంచి సంప్రదాయబద్దమైన అమ్మాయి ఉందంటూ.. జయకృష్ణ తన తండ్రితో మాట్లాడినట్టు చిరు చెప్పారు. అప్పుడు తన తండ్రి పిలిచి పెళ్లి గురించి అడిగారని, తాను వద్దని వారించినా చేసుకోమంటూ సూచించారన్నారు. అప్పుడు తనని గొర్రె పొట్టెల్ని బలికి తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని చిరు కామెడీగా చెప్పుకొచ్చారు. పెళ్లిచూపులయ్యాక తన కెరీర్ గుర్తుకొచ్చి, ఇప్పుడే పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పానన్నారు. అయితే.. ఓసారి కాఫీకని చెప్పి అల్లు రామలింగయ్య ఇంటికి పిలిచారని, అప్పుడు సురేఖ చేసిన కాఫీ తాగానని, అందులో ఆమె ఏం కలిసిందో ఏమో తెలీదు కానీ, తాను పెళ్లికి ‘ఊ’ అనేశానని చిరు వివరించారు. అలా వారి కుటుంబంలో తాను ఒక సభ్యుడిని అయ్యానంటూ.. ఇంకా చాలా విశేషాలే పంచుకున్నారు చిరంజీవి.