చిరంజీవి – రామ్ చరణ్ కథానాయకులుగా కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను రూపొందించారు. నిరంజన్ రెడ్డి – అవినాశ్ రెడ్డి ఈ సినిమా ను నిర్మించారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది ‘ఆచార్య’ చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ – యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ” 1988 లో రుద్రవీణ అనే సినిమా నాటితో నాగబాబు చేశాడు. ఆ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటి అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవడానికి మేము ఢిల్లీ వెళ్ళాం. అక్కడ అవార్డు ఫంక్షన్ కన్నా ముందు తేనీటి విందు ఇస్తారు.. ఆ హాల్లో కూర్చొని మేము టీ తాగుతున్నాం. అక్కడ గోడకంత ఇండియా సినిమా వైభవం అని రాసి ఉంది.. పోస్టర్ల తో పాటు వారు ఎవరు అనేది బ్రీఫ్ గా రాసి ఉంది. పృద్విరాజ్ కపూర్ నుంచి దిలీప్ కుమార్, దేవానంద్, ఒక్కరేంటి అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర అలా ప్రతి ఒక్కరి ఫోటోను చాలా అందంగా చూపించారు.
ఇది కదా మన కీర్తి అంటూ అనుకుంటూ పక్కన మన సౌత్ వాళ్లది ఉంటుంది కదా అని వెళ్తే నాకు సౌత్ కి సంబంధించి ఎంజీఆర్, జయలలిత కలిసి డాన్స్ లు చేస్తున్న ఒక స్టిల్ వేసి కింద సౌత్ సినిమా అని రాశారు అంతే అక్కడ ఇంకెవరి ఫోటోలు లేవు.. ఎన్టీఆర్ కానీ, ఏఎన్నార్ కానీ.. ఇటువైపు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ ఫోటో కానీ వీరెవ్వరి ఫోటోలు లేవు.. ఆ టైమ్ లో వాళ్లందరూ చాలా అవమానానికి గురయ్యారు. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని ప్రోజెక్ట్ చేసేవాళ్లు.. మిగతా భాషల సినిమాలు ఏవో ప్రాంతీయ భాషల సినిమాలుగా చూపించి విలువ ఇచ్చేవారు కాదు. నాకు అప్పటినుంచి చాలా బాధగా అనిపించింది. మద్రాసు వచ్చి నా బాధని మీడియాతో పంచుకున్నాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ తర్వాత నేను గర్వపడేలాగా తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదు ఇండియన్ సినిమా అని బాహుబలి తర్వాత చెప్పారు. ప్రాంతీయ సినిమా కాదు ఇండియన్ సినిమా అని చెప్పడానికి బాహుబలి 1,2, ఆర్ఆర్ఆర్ దోహద పడ్డాయి. భారతీయ సినిమా ఓ మతం అయితే, ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి, తెలుగు సినిమాను రాజమౌళి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు గర్వపడుతున్నాను. మన సినిమాను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని మనం గౌరవించుకోవాలి.
ఇక ఆచార్య విషయానికొస్తే.. ఆచార్య సినిమా చేశాను అంటే కూడా రాజమౌళినే కారణం. రాజమౌళి సినిమా అయ్యేదాకా ఆర్టిస్టులని వదిలిపెట్టడు. చరణ్ ఈ కథలో చేయాలి అన్నప్పుడు వెంటనే ఆయన ఒప్పుకొని చరణ్ ను పంపించడం వలనే ఈ సినిమా పూర్తి అయ్యింది. ఇక శివ గారి గురించి చెప్పాలంటే.. నేను అంతకుముందులా ఈ సినిమాలో కూడా చేసి ఉంటే ఇది కూడా ఇంకొక చిరంజీవి సినిమా అయ్యేది. కానీ నేను శివ సినిమాలు అన్ని చూశాను. చాలా వ్యత్యాసం ఉన్నాయి. ఒక నిండు గోదావరి నదిలో, మంచి పండు వెన్నెల్లో ఒక పడవ ప్రయాణంలా సాగుతోంది. ఇంత చక్కని సినిమాలో మనం మెలో డ్రామాగా చేసినా సరే చెప్పు కింద రాయిలా ఉంటుంది. అందుకే శివ చెప్పినట్టు నేను యాక్ట్ చేశాను. శివ సినిమాల్లో ఉండే కూల్ ని మా మాస్ తో జత చేసి ఆడియన్స్ కి కావాల్సిన విధంగా ప్రెజెంట్ చేశాడు. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు.. రామ్ లక్ష్మణ్, మణిశర్మ గారు.. నేను ఇంత యంగ్ గా కనిపించడానికి ప్రధాన కారణం తిరు. వీరితో పాటు టెక్నీషియన్స్ అందరికి ధన్యవాదాలు. ఏప్రిల్ 29 న ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని అనుకుంటున్నా” అని చెప్పుకొచ్చారు.
