Site icon NTV Telugu

Chiranjeevi: చిరంజీవి.. ‘ట్రిపుల్ ఈ’.. ఎందుకలా!?

Chiranjeevi

Chiranjeevi

‘సెంటిమెంట్ లేని జీవితం ఉప్పులేని పప్పులాంటిది’ అంటారు. అందుకే కాబోలు సినీజనం ‘సెంటిమెంట్స్’ చుట్టూ పరుగులు తీస్తూ ఉంటారు. అల్టిమేట్ గా అందరికీ కావలసింది సక్సెసే! విజయం కోసం పలువురు పలు పాట్లు పడతారు. అందులో భాగంగానే కొందరు సెలబ్రిటీస్ ‘న్యూమరాలజీ’ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంతటివారు సైతం ‘న్యూమరాలజీ’ ప్రకారం తన పేరులో ఓ ‘ఇ’ని అధికం చేసుకున్నారు. అందుకు నిదర్శనంగా జూలై 4న విడుదలైన చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ నిలచింది. ఆ ఫస్ట్ లుక్ వీడియో చూసిన వారికి ‘Megastar CHIRANJEEEVI’ అన్న పేరు అందులో దర్శనమిస్తుంది. కానీ, ఈ ఫస్ట్ లుక్ టీజర్ ను పరిశీలించి చూస్తే ఇలా ఒకచోట కనిపిస్తుందే తప్ప, అదే టీజర్ లో ‘గాడ్ ఫాదర్’ టైటిల్ మీద ఉన్న ‘మెగాస్టార్ చిరంజీవి’ అన్న చోట కేవలం రెండు ‘ఇ’లనే ఉంచారు. మరి బాగా కనిపించేలా మూడు ‘ఇ’లతోనూ, టైటిల్ పై ఉన్న పేరులో రెండు ‘ఇ’లనే పెట్టడంలోని మతలబేమిటో అర్థం కావడం లేదు. బహుశా, అదే చర్చనీయాంశం కావాలని మెగాస్టార్, ఆయన దర్శకనిర్మాతలు భావించారేమో!

చిరంజీవియే కాదు, చిత్రసీమలో ఎంతోమంది ఇలా న్యూమరాలజీ ప్రకారం పేరులో కొన్ని అక్షరాలను తగ్గించుకోవడమో, పెంచుకోవడమో చేస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఆయన ఆటోగ్రాఫ్ ఇస్తే ”ChiRUNGV”అంటూ రాసేవారు. అస్ట్రానమీ ప్రకారం “Chi”అంటే 22వ స్టార్. చిరంజీవి పుట్టినతేదీ ఆగస్టు 22. అందువల్ల ‘చి’తో వచ్చే పేర్లలో సదా జనం మదిలో నిలిచేలా ఉండే పేరు ‘చిరంజీవి’ కాబట్టి ఆ పేరును సూచించడం జరిగిందని వినికిడి. అలాగే చిరంజీవికి కలలో ఓ పాప ఆయనను “చిరంజీవి..” అంటూ పిలవడం కూడా ఆ పేరు పెట్టుకోవడానికి కారణం అని ఆయనే అప్పట్లో సెలవిచ్చారు. ఇక ”ChiRUNGV”లో ‘రన్’ అంటూ పరుగెత్తడం , ‘జి.వి.’ అంటే ‘గ్రేట్ విక్టరీ’ అని కొందరు న్యూమరాలజిస్టులు అప్పట్లో వివరించారు. మొత్తానికి ”ChiRUNGV” అనే దానిలో “22వ తేదీన పుట్టినవాడు ఘనవిజయం వైపు పరుగు తీస్తున్నాడు” అనే అర్థం దాగి ఉందని అనేవారు. అలా చిరంజీవిని ”ChiRUNGV” అని రాసుకోమని ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ సెలవిచ్చినట్టూ కొందరు చెబుతారు. ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ చిరంజీవి పేరు చర్చనీయాంశమయింది. మరి ఇప్పుడు ‘ట్రిపుల్ ఈ’లోని అర్థమేంటో అది సూచించినవారు చెబితేనే వివరంగా తెలుస్తుంది. ఇలా మార్పు చేసుకున్న తరువాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’తో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Exit mobile version