NTV Telugu Site icon

Chiranjeevi: చిరంజీవిగా నేను పుట్టినరోజు.. 44 ఏళ్ల జర్నీపై చిరు ఎమోషనల్

Chiru

Chiru

Chiranjeevi: కొణిదెల శివ శంకర్ వరప్రసాద్.. ఈ పేరు తెలియకపోవచ్చు.. తెలిసినా వినడానికి ఇష్టపడకపోవచ్చు. అదే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పండి.. డ్యాన్స్ లు డ్యాన్స్ లు ఆడేస్తారు. ఒక హీరో కష్టపడి పైకి రావడం గొప్పకాదు.. ఆ స్టేటస్, ఆ విజయాన్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకొనేలా చేయడం గొప్ప.. అది మెగాస్టార్ కు మాత్రమే సాధ్యమైన విజయం. ఒక విలన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమై స్టార్ గా.. మెగాస్టార్ గా ఎదగడం అంటే వెంటనే అయిన పని కాదు. ఎన్నో ఏళ్ళ శ్రమ, ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు అన్ని ఎదుర్కొని నిలబడితే వచ్చిన స్టేటస్ ఇది. నేటితో కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవి గా పుట్టి 44 ఏళ్ళు పూర్తయ్యాయి. అంటే చిరు మొదటి సినిమా 44 ఏళ్ళ క్రితం నేడు రిలీజ్ అయ్యిందన్నమాట. మొదటిసారి చిరు.. తనను తాను తెరపై చూసుకున్న రోజు. 1978, సెప్టెంబర్ 22 న చిరు నటించిన ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ అయ్యింది.

ఇక ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. తనను ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నిలబెట్టినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. “మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవి గా పుట్టిన రోజు, ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ‘ప్రాణం ఖరీదు ‘ ద్వారా ప్రాణం పోసి, ప్రాణప్రదంగా, నా ఊపిరై, నా గుండె చప్పుడై,అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎప్పటికీ .. చిరంజీవి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక 44 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో మెగా అభిమానులతో పాటు ప్రముఖులు కూడా చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.