కిలారు నవీన్ దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మించిన చిత్రం ‘మరో ప్రపంచం’. వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన పాత్రధారులు పోషించిన ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ట్రైలర్ విడుదల చేయగా, చిత్ర పోస్టర్ లుక్‌ను దర్శకులు సాగర్ కె చంద్ర, సాయికిరణ్ అడివి విడుదల చేశారు. అనంతరం నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ”డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు అభినందనలు. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఈ ట్రైలర్ చూపించాడు. నాకు నచ్చి ఈ కార్యక్రమానికి వచ్చాను. మనందరిలోనే చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. అలాంటిది ఓ ఐదుగురి ప్యారలల్ లైఫ్‌లో అలాంటి మార్పులు జరిగితే ఎలా ఉంటుంది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. మంచి ప్రయోగం. అలానే చక్కటి క్వాలిటీతో చిత్రీకరించారు. ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
ప్రొడ్యూసర్ వెంకటరత్నం మాట్లాడుతూ, ”కష్టం అంతా దర్శకుడు నవీన్‌దే. నేను జస్ట్ డబ్బు పెట్టాను అంతే. సబ్జెక్ట్ అండ్ ఆర్టిస్టులను నమ్మాను. వారందరూ 200 పర్సెంట్ న్యాయం చేశారు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. దాన్నే లీడ్ తీసుకొని 5 ప్యారలల్ మనుషులు మధ్య జరిగే కథే ‘మరో ప్రపంచం’. గుడ్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నా. వేరియంట్ సబ్జెక్ట్ చేయాలంటే గట్స్ అండ్ ఫ్యాషన్ ఉండాలని భావిస్తాను. అందుకే ప్రేక్షకులకు నచ్చేలా నవీన్ ఎక్సలెంట్ జాబ్ చేశారు” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కిలారు నవీన్ తో పాటు వెంకట్ కిరణ్, సురైయ పర్వీన్, అక్షిత, యామిన్, శ్రీనివాస్ సాగర్, మ్యూజిక్ డైరెక్టర్ శాండీ , సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.