NTV Telugu Site icon

వైవిధ్యంగా సాగుతున్న మంచు మనోజ్!

Manchu Manoj Birthday

Manchu Manoj Birthday

బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకాడు కానీ, తండ్రిలా వడి వాడి వేడి అన్నవి మనోజ్ లో అంతగా కనిపించవు. మనోజ్ ఆచితూచి అడుగు వేస్తూ సాగడంలోనే అతని రూటు సెపరేటు అని తెలిసిపోతుంది. మనోజ్ సినిమా ఎప్పుడు వచ్చినా, చూడటానికి మేం సిద్ధం అనే వారున్నారు.

మంచు మనోజ్ 1983 మే 20న మద్రాసులో జన్మించాడు. బాల్యంలోనే మనోజ్ కు కెమెరా ముందు అదురు బెదురు లేకుండా నటించడం అలవాటయింది. మహానటుడు నందమూరి తారక రామారావుతో మోహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’లో యన్టీఆర్ తో కలసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు మనోజ్. తండ్రికి యన్టీఆర్ అంటే ఎంతటి అభిమానమో, అంతే అభిమానం మనోజ్ కూ రామారావుపై ఉంది. అందుకే ‘బిందాస్’తో తనకు లభించిన ‘స్పెషల్ జ్యూరీ నంది’ అవార్డును తమ ఇంటిలోని యన్టీఆర్ పటం ముందు పెట్టి ఆనందించాడు. తాను కూడా ఆ మహానటుడు జన్మించిన ‘మే మాసం’లోనే పుట్టడం అదృష్టంగా భావిస్తూ ముందుకు సాగుతున్నాడు మనోజ్. తండ్రి హీరోగా రూపొందిన “అడవిలో అన్న, ఖైదీగారు” వంటి చిత్రాలలో బాలనటునిగానే మెప్పించిన మనోజ్ ‘దొంగ-దొంగది’ చిత్రంతో హీరోగా జనం ముందు నిలిచాడు. కొందరి మదిని గెలిచాడు. అప్పటి నుంచీ తనకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకొని ముందడుగు వేశాడు.

“శ్రీ, రాజూ భాయ్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంట్ తీగ, గుంటూరోడు” వంటి చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో కనిపించాడు మనోజ్. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో కలసి నటించిన మనోజ్ భలేగా మార్కులు కొట్టేశాడు. తరువాత మనోజ్ హీరోగా రూపొందిన ‘ఒక్కడు మిగిలాడు’ కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. “వేదం, కరెంట్ తీగ” చిత్రాల్లో మనోజ్ విలక్షణమైన అభినయం జనాన్ని భలేగా అలరించింది. త్వరలో ‘అహం బ్రహ్మస్మి’ సినిమాతో జనం ముందుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు మనోజ్. మరి ఈ సినిమాతో మనోజ్ ఏ రీతిన ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.