Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి

Raaka (1)

Raaka (1)

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రాకా’(Raaka)పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. రీసెంట్ గా మంచు లక్ష్మి ముంబైలో జరుగుతున్న ‘రాకా’ షూటింగ్ సెట్‌ను సందర్శించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలో నిర్మించిన భారీ సెట్స్‌ను చూసిన తర్వాత మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేశారు. తాను ఇప్పటివరకు అలాంటి సెట్‌ను చూడలేదని, అక్కడ కనిపించిన వింత జీవులు, భారీ నిర్మాణాలు, మొత్తం వాతావరణం తనను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పారు. బన్నీ చాలా రోజులుగా రాకా సెట్‌కు రమ్మని పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్లాక నేను చూసింది నిజంగా నమ్మలేకపోయానంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మంచు లక్ష్మి ఆ సెట్ లో చాలా వింతలు చూశానని ఆశ్చర్యపోతూ తన అనుభవాలను పంచుకున్నారు. అక్కడ ఉన్న జంతువులను కూడా నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ఇందులో బన్నీని ప్రేక్షకులు ఇప్పటివరకు ఎప్పుడూ చూడని లుక్‌లో చూస్తారు. ఇలాంటి సెట్‌ను కూడా నేను ఇంతవరకు చూడలేదు అంటూ ఆమె ఉత్సాహంగా చెప్పారు. సెట్‌లోని అనుభవాన్ని పూర్తిగా చెప్పాలని ఉన్నా, సినిమా రహస్యాల కారణంగా చెప్పలేకపోతున్నానని మంచు లక్ష్మి తెలిపారు. “ఎన్నో డిపార్ట్‌మెంట్లు పని చేస్తున్నాయి. మొత్తం సెట్లో మ్యాజిక్ జరుగుతున్నట్టుంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆగలేకపోతున్నాను. చాలా విషయాలు షేర్ చేయాలని ఉంది.. కానీ చెప్పలేనని ఆమె వీడియోను ముగించారు.

మంచు లక్ష్మి వ్యాఖ్యల తర్వాత అల్లు అర్జున్ లుక్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచగా, ఇప్పుడు బన్నీ మునుపెన్నడూ కనిపించని గెటప్‌లో కనిపిస్తారనే ప్రచారం అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తోంది. ‘రాకా’ చిత్రానికి దర్శకుడు అట్లీ తనదైన భారీ విజువల్ స్టైల్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి సెట్స్, విభిన్నమైన కాన్సెప్ట్, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, ముంబైలో జరుగుతున్న షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొత్తానికి, మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ‘రాకా’పై ఉన్న అంచనాలను మరోసారి రెట్టింపు చేశాయి.