NTV Telugu Site icon

Tamil Star Hero: దర్శన్ లాగే జర్నలిస్టును చంపి జైలుకెళ్లిన తమిళ ‘సూపర్ స్టార్’.. ఆ కథ ఏంటో తెలుసా?

M. K. Thyagaraja Bhagavathar

M. K. Thyagaraja Bhagavathar

M. K. Thyagaraja Bhagavathar arrested in Murder Case like darshan: నటుడు దర్శన్ హత్యకేసులో జైలుకు వెళ్లడంతో శాండల్‌వుడ్‌లోనే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. క్రేజీ ఫ్యాన్ బేస్ ఉన్న ఓ స్టార్ యాక్టర్ హత్య కేసులో ఇరుక్కోవడం ప్రస్తుత సినీ పరిశ్రమకు, అభిమానులకు షాకింగ్ న్యూస్. అయితే ఇలాంటి హత్య కేసులో జైలుకు వెళ్లిన తమిళనాట ఓ సూపర్ స్టార్ నటుడి కథ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ తమిళ నటుడు జైలుకు వెళ్లడం సినిమా కథలా ఉంటుంది. ఎనిమిది దశాబ్దాల క్రితం జరిగిన ఈ ఘటన సూపర్ స్టార్ హీరో జీవితాన్ని కబళించి వీధిన పడేసింది. మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతరు అలియాస్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ తమిళ సినిమా తొలి సూపర్ స్టార్. భాగవతార్ 1944లో తన అద్వితీయమైన నటనతో క్రేజ్ అందుకున్నారు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఏకైక నటుడు ఆయనే. కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు అయిన భాగవతార్ స్వయంగా వ్రాసి పాడేవారు. అతని కచేరీలకు చాలా డిమాండ్ ఉంది. 1934 మరియు 1959 మధ్య భాగవతార్ కేవలం 14 చిత్రాలలో మాత్రమే నటించారు.

Pavithra Ex Husband: దర్శన్ భార్య విజయలక్ష్మిపై పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ ఫిర్యాదు?

అందులో 10 సూపర్ హిట్స్ అయ్యాయి. 1944లో భాగవతార్ చిత్రం ‘హరిదాసు’ మద్రాసులోని బ్రాడ్‌వే థియేటర్‌లో మూడు సంవత్సరాల పాటు విజయవంతమైంది. తన ప్రతి సినిమాలో కమెడియన్‌గా ఎన్.ఎస్. కృష్ణన్ నటించేవాడు. వీరిద్దరి జోడీ తమిళ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణన్‌ను తమిళులు ‘చార్లీ చాప్లిన్’ అని ముద్దుగా పిలిచేవారు. వారి సినిమాలన్నీ హిట్ అయ్యాయి. భాగవతార్ ప్రతిరోజూ గులాబీ పువ్వులతో నిండిన నీటితో స్నానం చేసేవారట. ఆయన ప్రతిరోజూ చేపలు పట్టి వాటిని తినేవారట. అందుకే చేపల వేట కోసం రోజూ మద్రాసు నుంచి తిరుచ్చి వెళ్లేవాడు. అలాంటి భాగవతార్ దర్శన్ లానే హత్య కేసులో చికుక్కున్నారు. భాగవతార్ అహాన్ని ఓ జర్నలిస్టు దెబ్బ కొట్టాడు. అతని పేరు లక్ష్మీకాంతం. టాబ్లాయిడ్ పత్రికను నడిపిన లక్ష్మీకాంతం, భాగవతార్ చిత్రాలపై తీవ్ర విమర్శలు చేసేవారు. అతని కథనాలు సూపర్‌స్టార్ భాగవతార్‌కు కోపం తెప్పించాయి.

లక్ష్మీకాంతంకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భాగవతార్, ఆరుముగం, నాగలింగం అనే ఇద్దరికి అతన్ని కొట్టమని సుపారీ ఇచ్చారు. నవంబర్ 8, 1944 న ఆర్ముగం మరియు నాగలింగం గ్యాంగ్, లక్ష్మీకాంతంపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీకాంతంమరుసటి రోజు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. జర్నలిస్టు లక్ష్మీకాంతం హత్య కేసులో భాగవతార్‌ను నిందితుడిగా ప్రకటించి 30 నెలల (రెండున్నర సంవత్సరాలు) జైలు శిక్ష విధించారు. తమిళుల ఆరాధ్య దైవం అయిన భాగవతార్ రెండున్నరేళ్లు అండమాన్ జైల్లో గడపాల్సి వచ్చింది. అలా ఆ సూపర్‌స్టార్ జైలుకు వెళ్లి అప్పట్లో కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్‌కి గురి చేశాడు.

భాగవతార్ జైలుకు వెళ్లడంతో దాదాపు 12 సైన్ చేసిన సినిమాల షూటింగ్ ఆగిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన జైలుకు వెళ్ళాక విడుదలైన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. జైలు నుంచి విడుదలైనప్పటికీ తమిళ చిత్రసీమలో భాగవతార్ తన ఆధిపత్యాన్ని కోల్పోయాడు. గతంలో లాగా అవకాశాలు రాలేదు. భాగవతార్ ని పెట్టి సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. భాగవతార్ జైలు నుంచి బయటకు వచ్చే సమయానికి తమిళ సినిమా కొత్త నటీనటులతో నిండిపోయింది. అవకాశాల్లేక దారుణమైన జీవనం సాగిస్తున్న భాగవతార్ విధిలేక గాయకుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దేశమంతటా దేవాలయాలకు వెళ్లి కచేరీలు చేస్తూ కడుపు నింపుకునేవాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భాగవతార్ తన 49వ ఏట తుది శ్వాస విడిచారు.

Show comments