NTV Telugu Site icon

KS.Ramarao: ‘క్రియేటివ్ కమర్షియల్స్’ రామారావు!

76b1b857 3961 4daf B627 Ae688b2904d8

76b1b857 3961 4daf B627 Ae688b2904d8

క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.యస్.రామారావు పేరు తెలియనివారు తెలుగు చిత్రసీమలో ఉండరు. ఇక ఆయన నిర్మించిన చిత్రాల గురించి సగటు సినిమా అభిమానికి తెలియకుండా ఉండదు. ఎందుకంటే కె.యస్.రామారావు నిర్మించిన అనేక చిత్రాలు ఇళయరాజా స్వరకల్పనతో మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నిర్మాత కె.యస్.రామారావు.

కె.యస్.రామారావు 1945 జూలై 7న జన్మించారు. విజయవాడలోనే ఆయన బాల్యం, విద్యాభ్యాసం సాగాయి. చిన్నతనం నుంచీ సినిమాలంటే అమితాసక్తి. మద్రాసు వెళ్ళి అక్కడ ప్రముఖ దర్శక నిర్మాత కె.యస్.ప్రకాశరావు వద్ద దర్శకత్వ శాఖలో చేరారు రామారావు. ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన “బందిపోటు దొంగలు, విచిత్ర కుటుంబం, నా తమ్ముడు” వంటి చిత్రాలకు పనిచేశారు. తరువాత మళ్ళీ విజయవాడ వచ్చి ‘జై ఆంధ్రా ఉద్యమం’లో ముమ్మరంగా పాల్గొన్నారు. మళ్ళీ సినిమా రంగంవైపు వెళ్ళారు. అప్పుడు ‘క్రియేటివ్ కమర్షియల్స్’ పేరిట రేడియో పబ్లిసిటీ ఆరంభించారు. అనేక సూపర్ హిట్ మూవీస్ కు ఆయన రేడియో పబ్లిసిటీ చేశారు. తరువాత అనువాద చిత్రాలను అందించడం మొదలు పెట్టారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు నిర్మించిన డబ్బింగ్ సినిమాల్లో “ఎర్రగులాబీలు, టిక్ టిక్ టిక్, మౌనగీతం” వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఆ సినిమాలతో లాభాలు చూడగానే ఓ స్ట్రెయిట్ మూవీ తీయాలని భావించారు రామారావు.

‘ఆంధ్రజ్యోతి వారపత్రిక’లో ధారావాహికగా ప్రచురితమైన యండమూరి వీరేంద్రనాథ్ ‘అభిలాష’ రామారావుకు భలేగా నచ్చింది. దానిని చిరంజీవి హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాకు ఇళయరాజా బాణీలు కూడా ఓ ఎస్సెట్! ‘అభిలాష’ మంచి విజయం సాధించింది. అప్పటి నుంచీ చిరంజీవి, కోదండరామిరెడ్డి, యండమూరి, ఇళయరాజా కాంబినేషన్ లో కె.యస్.రామారావు సినిమాలు నిర్మించసాగారు. అలా వీరి కలయికలో “ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం” వంటి నవలాచిత్రాలు రూపొంది జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. యండమూరిని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘ముత్యమంత ముద్దు’ చిత్రాన్ని తెరకెక్కించారు రామారావు. తరువాత చిరంజీవి హీరోగా యండమూరి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అంతగా అలరించలేక పోయింది.

వెంకటేశ్ తో కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘స్వర్ణకమలం’ చిత్రానికి నిర్మాణభాగస్వామిగా ఉన్నారు రామారావు. వెంకటేశ్ తో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మించిన ‘చంటి’ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాదు, ఇండస్ట్రీ హిట్ గానూ నిలచింది. ‘చంటి’ తరువాత పదేళ్ళకు వెంకటేశ్ తో ‘వాసు’ నిర్మించారు. మాధవి ప్రధాన పాత్రలో ఆయన నిర్మించిన ‘మాతృదేవోభవ’ ఎంతగానో అలరించింది. నాగార్జునతో ‘క్రిమినల్’, శ్రీకాంత్ తో ‘హలో.. ఐ లవ్ యూ’, సిద్ధార్థ్ తో ‘చుక్కల్లో చంద్రుడు’, ప్రభాస్ తో ‘బుజ్జిగాడు’ చిత్రాలనూ నిర్మించారు. తన తనయుడు వల్లభ నిర్మాతగా, కె.యస్.రామారావు తన సమర్పణలో “మళ్ళి మళ్ళి ఇది రాని రోజు, కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్” తెరకెక్కించారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘భోళాశంకర్’ చిత్రాన్ని ఏ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ తో కలసి నిర్మిస్తున్నారు కె.యస్.రామారావు. ఎన్నో ఏళ్ళకు చిరంజీవి కాంబోలో సినిమా నిర్మిస్తోన్న రామారావు ఈ సారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.