Chennai Love Story OTT Release: థియేటర్లలో ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రేమకథలు ఓటీటీలోకి వస్తే వాటిపై ఆసక్తి మరింత పెరుగుతుంది. అలాంటి సినిమాల్లో ఒకటైన కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జూలైలో థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ రొమాంటిక్ డ్రామా, ఇప్పుడు ఒకేసారి ఐదు భాషల్లో ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. 2026 జూలై 24న విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోయింది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ మధ్య కెమిస్ట్రీ, సంగీతం సినిమాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ విజయాన్ని ఓటీటీలో కూడా కొనసాగించాలనే లక్ష్యంతో చిత్ర బృందం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది.
సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ సినిమా 2026 ఆగస్టు 21 నుంచి సోనీలివ్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుండటంతో మరింత విస్తృత ప్రేక్షకాదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంతో దర్శకుడిగా రవి నంబూరి తొలి అడుగు వేశారు. కథను ప్రముఖ దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ అందించడమే కాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరించారు. ఎస్.కె.ఎన్ మరో నిర్మాతగా ఉండగా, మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. సినిమాకు సంగీత దర్శకుడు మణి శర్మ అందించిన పాటలు రిలీజ్ సమయంలోనే మంచి ఆదరణ పొందాయి. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న చెన్నై లవ్ స్టోరీ, ఇప్పుడు సోనీలివ్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రేమకథలు, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఇది మంచి ఓటీటీ సజెషన్ గా నిలవొచ్చు.
స్టోరీ
కార్పొరేట్ ఉద్యోగి అయిన నివి అలియాస్ నివేదిత (శ్రీ గౌరీ ప్రియ), అజయ్ (త్రిగుణ్) అనే అబ్బాయిని ఐదేళ్లుగా (రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమ) గాఢంగా ప్రేమిస్తుంది. వీరిద్దరికీ పెళ్లి కూడా నిశ్చయమవుతుంది, కానీ సరిగ్గా పెళ్లి రోజే అజయ్ తాను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పి నివిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ ఊహించని షాక్‌తో తీవ్ర నిరాశకు గురైన నివి, ఆ బాధను భరించలేక క్రమంగా మద్యానికి బానిస అవుతుంది. ఆమెను ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి స్నేహితులు ఆమెను చెన్నైకి తీసుకువస్తారు.
అక్కడి బీచ్‌లో ఆమెకు అనుకోకుండా స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే అనాథ కుర్రాడు పరిచయమవుతాడు. స్టీవెన్ చచ్చేలోపు ఒక్కసారైనా వెండితెరపై తన పేరు చూసుకోవాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. మొదట్లో గొడవలతో ప్రారంభమైన వీరి పరిచయం, స్టీవెన్ మంచి స్వభావం చూసి నెమ్మదిగా స్నేహంగా మారుతుంది. నివి జీవితంలోకి వచ్చిన స్టీవెన్, ఆమె ముఖంలో మళ్లీ నవ్వులు పూయించి ఆమెను సాధారణ స్థితికి తెస్తాడు. ఈ క్రమంలో నివి అతనిపై ప్రేమను పెంచుకుంటుంది. అయితే, వారిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకోవాలని సిద్ధమవుతున్న తరుణంలో కథలో ఒక ఊహించని పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? స్టీవెన్ దర్శకుడు అయ్యాడా? అజయ్ మళ్లీ నివి జీవితంలోకి వచ్చాడా? చివరికి ఈ ప్రేమకథ ఎలా ముగిసింది? అనేదే మిగిలిన సినిమా.

