Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా

Chennai Love Story3

Chennai Love Story3

Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు పెద్ద సంచలనాలు సృష్టించడం కొత్త విషయం కాదు. అయితే ప్రేక్షకుల మనసును హత్తుకునే కంటెంట్ ఉంటే, దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపిస్తోంది కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా సాధించిన రెస్పాన్స్ చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు నమోదు చేస్తోంది. ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ దిశగా విజయవంతంగా పయనిస్తున్న ఈ సినిమా, ఉత్తర అమెరికాలో విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 500,000 డాలర్ల మార్క్‌ను దాటినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇది అత్యంత కీలకమైన ఓవర్సీస్ విజయాల్లో ఒకటిగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

సాధారణంగా ప్రేమకథా చిత్రాలకు విదేశాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఈసారి కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, వివాహం తర్వాత దాంపత్య జీవితంలో ఎదురయ్యే ఎమోషన్స్ ను చూపించిన విధానం  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువత కూడా ఈ చిత్రానికి మంచి స్పందన ఇస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ గా  నిలిచింది.  ఈ మూవీని ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. కథను కూడా సాయి రాజేష్ అందించగా, సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.