Anandita Surgery Rumours : స్టార్ హీరోలు, హీరోయిన్ల పిల్లలుగా పుట్టడం బయటివారికి అదృష్టంగా కనిపించవచ్చు. అయితే ఆ గుర్తింపుతో వచ్చే ఒత్తిడి, విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ఎంత బాధాకరంగా ఉంటుందో చాలా అరుదుగా బయటకు వస్తుంది. ఇప్పుడు అలాంటి అనుభవాన్నే బహిరంగంగా పంచుకున్నారు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె ఆనందిత సుందర్. తన బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, బాడీ షేమింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్జరీలు చేయించుకుందని, బరువు తగ్గించే ఇంజెక్షన్లు వాడిందని వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.
జేఎఫ్‌డబ్ల్యూ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆనందిత సుందర్, తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి వివరంగా మాట్లాడారు. చిన్నప్పటి నుంచి తాను, తన అక్క అవంతిక ఇద్దరూ కాస్త లావుగానే ఉండేవాళ్లమని చెప్పారు. వయసు పెరిగే కొద్దీ ఊబకాయం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో ఫిట్‌గా మారాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చారు. 2018 నుంచే క్రమంగా వ్యాయామం, డైట్ పాటించడంతో ఇలా సన్నబడ్డామని, ప్రస్తుతం కనిపిస్తున్న మార్పు ఒక్కసారిగా రాలేదని స్పష్టం చేశారు. ఆనందిత మాట్లాడుతూ, ఈ రూపానికి రావడానికి తనకు దాదాపు ఏడేళ్ల సమయం పట్టిందన్నారు. చాలామంది వాస్తవాలు తెలుసుకోకుండా సర్జరీలు చేయించుకుందంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి నిర్ణయాలకు ఎలా వస్తారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్న ఓజెంపిక్, మౌంజారో వంటి బరువు తగ్గించే మందులు తాను వాడినట్లు వస్తున్న ప్రచారాన్ని కూడా ఆమె కొట్టిపారేశారు. గతంలో తన తల్లి ఖుష్బూ సుందర్ బరువు తగ్గిన సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహా ప్రచారం తనపై కూడా జరుగుతోందని అన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా రాయొచ్చనే పరిస్థితి ఉందని, అలాంటి ప్రచారాన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాదని తనకు ఇప్పుడు అర్థమైందని చెప్పారు. తాను ఇతరులను ఆకట్టుకోవడానికి బరువు తగ్గలేదని, కేవలం తన ఆరోగ్యం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.
చిన్న వయసులో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి కూడా చెప్పుకుంటూ ఆనందిత ఎమోషన్ అయ్యారు. 15 ఏళ్ల వయసులోనే తనపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని తెలిపారు. తమ తల్లిదండ్రులు సెలబ్రిటీలు కావొచ్చని, కానీ తాను ఒక సాధారణ టీనేజ్ అమ్మాయినేనని, అలాంటి వయసులో ఉన్న పిల్లలపై ఇంత దారుణంగా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాడీ షేమింగ్ వల్ల మానసికంగా ఎంత బాధపడాల్సి వచ్చిందో కూడా ఆమె వెల్లడించారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే, ఆనందిత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన ఆమె, తర్వాత కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. అయితే కాలు విరగడంతో ఆ ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇటీవల విడుదలైన ‘డబుల్ ఆక్యుపెన్సీ’ చిత్రంతో ఆనందిత క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా సినీ పరిశ్రమలో కొత్త బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం హిప్‌హాప్ తమీజా ఆది నటిస్తున్న ‘మీసయ మురుక్కు 2’ చిత్ర పనుల్లో కూడా ఆమె బిజీగా ఉన్నారు. వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా, తన పనితోనే గుర్తింపు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆనందిత సుందర్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

