Karan Johar Gives Clarity On Yash Role In Brahmastra 2: బ్రహ్మాస్త్ర సినిమా విడుదలైనప్పటి నుంచి.. అందులో ‘దేవ్’ పాత్ర ఎవరు పోషిస్తారు? అనే విషయంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎందరో స్టార్ హీరోల పేర్లు తెరమీదకొచ్చాయి. అయితే.. కొన్ని రోజుల నుంచి మాత్రం ఆ పాత్రలో కన్నడ హీరో యశ్‌ని తీసుకోవాలని ‘బ్రహ్మాస్త్ర’ నిర్మాత కరణ్ జోహార్ నానాతంటాలు పడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఒకసారి చర్చలు జరిపితే, అప్పుడు యశ్ నో చెప్పాడన్న వార్తలు కూడా వినిపించాయి. అయినా పట్టు వదలకుండా.. యశ్‌నే రంగంలోకి దింపాలని కరణ్ అతని వెంట పడుతున్నాడని, భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశాడని గాసిప్పులు గుప్పుమన్నాయి. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు కాబట్టి, అతడ్ని ‘దేవ్’ పాత్రలో నటింపచేస్తే ‘బ్రహ్మాస్త్ర 2’కి మరింత క్రేజ్ వచ్చిపడుతుందన్న ఉద్దేశంతోనే అతని వెంట పడినట్టు రూమర్స్ వచ్చాయి.
అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా కరణ్ జోహార్ స్పష్టం చేశాడు. దేవ్ పాత్ర కోసం యశ్‌ని సంప్రదించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసలు తాము ఏ ఒక్కరినీ సంప్రదించలేదని కరణ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో.. దేవ్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే ప్రశ్న మళ్లీ మిస్టరీగానే మిగిలిపోయిందన్నమాట! ఇదే సమయంలో.. యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు. కన్నడలో ‘మఫ్టీ’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన నర్తన్‌తో యశ్ తన తదుపరి చిత్రం చేయొచ్చని గుసగుసలు వినిపించాయి కానీ, అందులో నిజమెంత అన్నది క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు.. ‘కేజీఎఫ్ 3’ తీసేదాకా యశ్ మరో సినిమా చేయడని ఓ వర్గం ఆడియెన్స్ చెప్తున్నారు. కానీ, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘సలార్’ షూట్‌లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు కూడా కమిట్ అయ్యాడు. అంటే, ఈ డైరెక్టర్ ఫ్రీ అయ్యేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి.. కేజీఎఫ్ 3 ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు. మరి, యశ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడో చూడాలి.
