NTV Telugu Site icon

Kaikala Satyanarayana Birthday: న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌముడు… స‌త్య‌నారాయ‌ణ‌!

Kaikala Satyanarnay

Kaikala Satyanarnay

Kaikala Satyanarayana Birthday Special :
తెలుగు చిత్ర‌సీమ‌లో ఎంద‌రో త‌మ‌దైన అభిన‌యంతో జ‌నాన్ని విశేషంగా ఆక‌ట్టుకొని అల‌రించారు. వారిలో కొంద‌రు న‌ట‌సార్వ‌భౌములుగా, మ‌రికొంద‌రు న‌ట‌చ‌క్ర‌వ‌ర్తులుగా, న‌ట‌స‌మ్రాట్టులుగానూ, ఇంకొంద‌రు న‌ట‌విరాట్టులుగానూ విరాజిల్లారు. తెలుగునాట మ‌న‌కు క‌నిపించే న‌ట‌సార్వ‌భౌములు ముగ్గురే – వారు విశ్వ‌విఖ్యాత న‌టసార్వ‌భౌమ య‌న్.టి. రామారావు, న‌ట‌సార్వ‌భౌమ య‌స్.వి. రంగారావు, న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. తెలుగు చిత్ర‌సీమ‌లో అల‌రించిన అరుదైన న‌టుల‌లో నిస్సందేహంగా కైకాల స‌త్య‌నారాయ‌ణ పేరు చెరిగిపోని, త‌రిగిపోని చ‌రిత్ర‌ను సొంతంచేసుకుంది అన‌డం అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తినాయ‌కునిగా స‌త్య‌నారాయ‌ణ జ‌డిపించారు. గుణ‌చిత్ర‌న‌టునిగా మురిపించారు. హాస్యంతో అల‌రించారు. క‌రుణంతో క‌ట్టిప‌డేశారు. ఒక్క‌టేమిటి న‌వ‌ర‌సాల‌నూ స‌త్య‌నారాయ‌ణ అల‌వోక‌గా పండించారు. అందుకే జ‌నం ఆయ‌న‌ను `న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ‌` అంటూ కీర్తించారు. ఇవాళ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా సత్యనారాయణ కెరీర్ ను ఓసారి గుర్తుచేసుకుందాం.

కైకాల స‌త్య‌నారాయ‌ణ 1935 జులై 25న కృష్ణాజిల్లా కౌతారంలో జ‌న్మించారు. గుడ్లవ‌ల్లేరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన స‌త్య‌నారాయ‌ణ‌. విజ‌య‌వాడ‌లో ఇంట‌ర్మీడియ‌ట్, గుడివాడ కాలేజీలో ప‌ట్టా పుచ్చుకున్నారు. చ‌దువుకొనే రోజుల్లోనే నాట‌కాలు వేస్తూ సాగారు. కొన్ని నాట‌కాల్లో స్త్రీ వేషాలూ వేసిఆక‌ట్టుకున్నారు. మిత్రులు ఆయ‌న‌ను `అచ్చు య‌న్టీఆర్ లా ఉన్నావ్` అనేవారు. అదే ఆయ‌న‌లో ఆత్మ‌విశ్వాసం పెంచింది. ఓ సారి స‌త్య‌నారాయ‌ణ వేసిన నాట‌కాన్ని చూసిన కొంద‌రు సినిమా జ‌నం ప్ర‌ముఖ నిర్మాత డి. ఎల్. నారాయ‌ణ‌కు అత‌ను య‌న్టీఆర్ పోలిక‌ల‌తో ఉన్నార‌ని చెప్పారు. డి. య‌ల్ . నారాయ‌ణ తాను తీస్తోన్న `సిపాయి కూతురు`లో జ‌మున స‌ర‌స‌న నాయ‌కునిగా స‌త్య‌నారాయ‌ణ‌ను ఎంచుకున్నారు. కొత్త హీరో,అందునా జ‌మున వంటి సీనియ‌ర్ స‌ర‌స‌న ఏమి బాగుంటుంద‌ని ఫైనాన్సియ‌ర్స్ పెద‌వి విరిచారు. డి. య‌ల్. మాత్రం జంకకుండా స‌త్య‌నారాయ‌ణ‌నే ఎంచుకున్నారు. మొత్తానికి తొలి చిత్రం ‘సిపాయి కూతురు’లోనే జ‌మున స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కింది. కానీ, ఆ చిత్రం ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో స‌త్య‌నారాయ‌ణ‌కు మ‌రి వేషాలు ద‌క్క‌లేదు. ఆ స‌మ‌యంలో బి.విఠ‌లాచార్య స‌త్య‌నారాయ‌ణ‌ను ప్రోత్స‌హించారు. తాను తెర‌కెక్కించిన ‘క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌’లో స‌త్య‌నారాయ‌ణ‌కు కీల‌క పాత్ర‌ను ఇచ్చారు. అదే స‌మ‌యంలో య‌న్టీఆర్ కు స‌న్నిహితుడైన య‌స్. డి. లాల్ ద‌ర్శ‌కునిగా తొలి ప్ర‌య‌త్నంలో ‘స‌హ‌స్ర శిర‌చ్ఛేద అపూర్వ చింతామ‌ణి’ తెర‌కెక్కిస్తూ అందులో రాజ‌కుమారుని పాత్రను స‌త్య‌నారాయ‌ణ‌కు ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు స‌త్య‌నారాయ‌ణ‌కు న‌టునిగా మంచి మార్కులు సంపాదించిపెట్టాయి. ఇక య‌న్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేసిన ‘రాముడు – భీముడు’లో య‌న్టీఆర్ కు `బాడీ డ‌బుల్`గా స‌త్య‌నారాయ‌ణ నటించారు. ఆ సినిమా విడుద‌ల‌యి, ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో య‌న్టీఆర్ బాడీ డ‌బుల్ గా న‌టించిన స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా మంచి గుర్తింపు ల‌భించింది. ఆ త‌రువాత య‌న్టీఆర్ అనేక చిత్రాల‌లో స‌త్య‌నారాయ‌ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తూ సాగారు. ఆయ‌న‌కు న‌టునిగా ట‌ర్నింగ్ పాయింట్ య‌న్టీఆర్ ‘ఉమ్మ‌డి కుటుంబం’తోనే ల‌భించింది. అందులో య‌న్టీఆర్ కు రెండో అన్న‌గా స‌త్య‌నారాయ‌ణ న‌టించారు. క‌రుణ‌ర‌స ప్ర‌ధాన‌మైన ఆ పాత్ర‌తో న‌టునిగా స‌త్య‌నారాయ‌ణ‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

చాలా చిత్రాల‌లో స‌త్య‌నారాయ‌ణ క్రూర పాత్ర‌లే ధ‌రించారు. అప్ప‌టి దాకా రాజ‌నాల‌, నాగ‌భూష‌ణం వంటివారు ప్ర‌తినాయ‌కులుగా రాణించారు. య‌న్టీఆర్ హీరోగా కె. విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన `నిండు హృద‌యాలు`లో స‌త్య‌నారాయ‌ణ ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుడు. ఆ సినిమా విజ‌యంతో ఇత‌ర హీరోలు సైతం స‌త్య‌నారాయ‌ణ‌నే త‌మ చిత్రాల‌లో విల‌న్ గా న‌టించాల‌ని కోరారు. అలా ఒక్క యేడాదిలోనే స‌త్య‌నారాయ‌ణ స్టార్ యాక్ట‌ర్ అయిపోయారు. య‌న్టీఆర్, ఏయ‌న్నార్ చిత్రాల‌లోనే కాదు అప్ప‌ట్లో వ‌ర్ధ‌మాన క‌థానాయ‌కులుగా రాణిస్తున్న శోభ‌న్ బాబు, కృష్ణ చిత్రాల‌లోనూ ఆయ‌నే విల‌న్ గా న‌టించి మెప్పించేవారు. కె.విశ్వ‌నాథ్ రూపొందించిన `శార‌ద‌` చిత్రంలో నాయిక అన్న పాత్ర‌లో స‌త్య‌నారాయ‌ణ కరుణ ర‌సం కురిపించారు. ఆ సినిమా కూడా జ‌నాన్ని విశేషంగా అల‌రించింది. దాంతో స‌త్య‌నారాయ‌ణ కేవ‌లం జ‌డిపించే పాత్ర‌లే కాదు, క‌న్నీరు పెట్టించే పాత్ర‌ల్లోనూ మెప్పించ‌గ‌ల‌ర‌ని నిరూపించుకున్నారు.

పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘికాల్లో స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన బాణీ ప‌లికించారు. య‌న్టీఆర్, య‌స్వీఆర్ వంటి మ‌హాన‌టులు ధ‌రించిన య‌మ‌ధ‌ర్మ‌రాజు, రావ‌ణుడు, దుర్యోధ‌నుడు వంటి పాత్ర‌ల‌ను పోషించి మెప్పించారు స‌త్య‌నారాయ‌ణ‌. మూడు త‌రాల హీరోల చిత్రాల‌లో ప్ర‌తినాయ‌క పాత్ర‌లు పోషించి అల‌రించారాయ‌న‌. నిర్మాత‌గానూ కొన్ని చిత్రాలు నిర్మించి ఆక‌ట్టుకున్నారు. స‌త్య‌నారాయ‌ణ తెలుగు చిత్ర‌సీమ‌కు చేసిన సేవ‌ల‌కు గాను 2011లో ఆయ‌న‌కు `ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు` ల‌భించింది. గత కొంతకాలంగా వయోభారంతో నటనకు సత్యనారాయణ దూరంగా ఉంటున్నారు. ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కేజీఎఫ్’ సీరిస్ కు సత్యనారాయణ సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. ఇటీవల కరోనా బారిన పడి భగవంతుని దయ వల్ల కోలుకున్నారు. ఈ నవరస నటనాసార్వభౌముడు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుందాం.

Show comments