Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్

Salmankhan1

Salmankhan1

Kaala Hiran Controversy : బాలీవుడ్‌లో ‘కాలా హిరణ్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ’ మూవీ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కథ గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింకల వేట కేసుతో పోలికలు కలిగి ఉందని భావిస్తున్న సల్మాన్, ఈ ప్రాజెక్ట్ తన ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశముందని వాదిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తరఫు న్యాయ బృందం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కీలకమైన అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా పోస్టర్లు, టీజర్ కంటెంట్ తనను పరోక్షంగా గుర్తించేలా ఉన్నాయని, ప్రేక్షకుల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించే ప్రమాదం ఉందని ఆయన వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా నిర్మాణం, ప్రచారం, విడుదలపై తక్షణ స్టే విధించాలని ఆయన కోర్టును కోరినట్లు సమాచారం.

ఈ వివాదానికి మూలం 1998లో వెలుగులోకి వచ్చిన కృష్ణజింకల వేట కేసు. ఆ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. సంవత్సరాలుగా న్యాయపరమైన విచారణలు, అప్పీలు కొనసాగుతూ వచ్చింది ఈ కేసు వ్యవహారం. ఇప్పుడు అదే అంశాన్ని పోలిన కథతో సినిమా వస్తోందనే ప్రచారం మరింత వివాదానికి కారణమైంది. అయితే చిత్రబృందం మాత్రం తమ ప్రాజెక్ట్‌ను సమర్థిస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ న్యాయవాదులు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపి సినిమా ప్రచారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ చిత్రనిర్మాతలు తమ వైఖరిని మార్చకుండా ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అమిత్ జానీ నిర్మిస్తున్న ఈ చిత్రం కృష్ణజింకల కేసుతో పాటు మరికొన్ని వివాదాస్పద సంఘటనలను కూడా ప్రస్తావిస్తుందనే ప్రచారం ఉండటంతో ప్రజల దృష్టి మరింతగా ఈ సినిమాపై పడింది. ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీ హైకోర్టు వైపే ఉంది. కోర్టు ఈ వ్యవహారాన్ని త్వరలో విచారించనుండగా, తీర్పు సినిమా భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో పెరుగుతోంది.

×
×
Ad