Site icon NTV Telugu

K Vishwanath : ఫిబ్రవరి మాసం… విశ్వనాథుని బంధం!

Kvishwanath

Kvishwanath

కాశీనాథుని విశ్వనాథ్ ఈ లోకంలో కన్నుతెరచింది 1930 ఫిబ్రవరి 19 న . తన బి.యస్సీ పట్టా పుచ్చుకోగానే చిత్రసీమపై ఆసక్తితో ఆయన విజయావాహినీ స్టూడియోస్ లో అడుగు పెట్టిందీ 1950 ఫిబ్రవరిలోనే. విజయా సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు వి.శివరామ్ వద్ద సౌండ్ రికార్డింగ్ విభాగంలో పనిచేశారు. అక్కడ ఉండగానే దర్శకత్వంపై మనసు మల్లించారు. కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్ వంటి దిగ్దర్శకుల పనితీరును గమనిస్తూ వచ్చారు. తరువాత ఆదుర్తి సుబ్బారావు వద్ద 1956లో చేరిందీ ఫిబ్రవరి మాసంలోనే. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు ఆదుర్తికి అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్. ఆయనలోని ప్రతిభను గమనించిన అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు తమ ‘ఆత్మగౌరవం’ చిత్రంతో దర్శకునిగా పరిచయంచేశారు. ఆ సినిమా తొలి కాపీ సిద్ధమయింది 1966 ఫిబ్రవరిలోనే. అయితే సినిమాను పలువురికి చూపించి విడుదల చేసేటప్పటికి మార్చి 11 అయింది.

Read Also: K.Vishwanath: విశ్వనాథ్ ‘ఎస్’ సెంటిమెంట్!

అప్పటి దాకా విశ్వనాథ్ ఎన్ని చిత్రాలు రూపొందించినా, ఆయనకు ‘కళాతపస్వి’ అన్న పేరును సంపాదించి పెట్టింది ‘శంకరాభరణం’ చిత్రమనే చెప్పాలి. ఈ సినిమాను 1979లోనే పూర్తిచేశారు. అవార్డులకు కూడా ఆ తేదీతోనే పంపించారు. రాష్ట్ర, కేంద్రప్రభుత్వ అవార్డులు వచ్చాయి. అయితే ఆ సినిమాను చూసి పంపిణీదారులు మొదట పెదవి విరిస్తూవచ్చారు. చివరకు ‘శంకరాభరణం’ 1980 ఫిబ్రవరి 2న విడుదలై మెల్లగా మౌఖిక ప్రచారంతో మంచి పేరు సంపాదించి, ఆ యేడాది అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది. తొలుత కొన్ని కేంద్రాలలో కేవలం ఉదయం ఆటలతోనే ప్రదర్శితమైన ‘శంకరాభరణం’ తరువాత రెగ్యులర్ షోస్ తో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. తమిళనాడు, కేరళలలోనూ ‘శంకరాభరణం’ ఘనవిజయం సాధించింది. దేశవిదేశాల్లో జయకేతనం ఎగురవేసింది. అంతటి చరిత్రను విశ్వనాథ్ కు సొంతం చేసిన ‘శంకరాభరణం’ విడుదలైన ఫిబ్రవరి 2వ తేదీనే ఆయన కూడా తనువు చాలించడం దైవికం అనే చెప్పాలి. ‘శంకరాభరణం’ 43ఏళ్లు పూర్తిచేసుకున్న రోజున విశ్వనాథ్ చివరి శ్వాస విడిచారు. మరో 17 రోజులు అంటే ఫిబ్రవరి 19వ తేదీ వరకు విశ్వనాథుడు ఉండిఉంటే 93 ఏళ్ళు పూర్తిచేసుకొనేవారు. ఏది ఏమైనా విశ్వనాథ్ ను కళాతపస్విగా నిలిపిన ఫిబ్రవరి 2వ తేదీనే ఆయన తనువు చాలించారన్నది విశేషం!

Exit mobile version