NTV Telugu Site icon

K Raghavendra Rao: ఇలాంటి హీరో-డైరెక్టర్ కాంబినేషన్ ఇంకోటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్!

Krr

Krr

K Raghavendra Rao: తెలుగు చిత్రసీమలో ‘దర్శకేంద్రుడు’గా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం పలు విశేషాలకు నెలవు! దర్శకునిగా రాఘవేంద్రరావు సక్సెస్ రేట్ తెలుగు చిత్రసీమలో అనితరసాధ్యమనే చెప్పాలి. శతాధిక చిత్రాలు రూపొందించి, తన సినిమాల ద్వారా ఎంతోమందికి సూపర్ స్టార్ డమ్ సంపాదించి పెట్టిన దర్శకులు రాఘవేంద్రరావు. ఆయన చలనచిత్రజీవితం భావి దర్శకులకు ఓ పాఠ్యాంశంగా నిలచి తీరుతుందని చెప్పవచ్చు. తెలుగునాటనే కాదు హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారాయన. అంతలా రాఘవేంద్రరావు జైత్రయాత్ర సాగడానికి కారణం – విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు అనే చెప్పాలి. ఈ విషయాన్ని కె.రాఘవేంద్రరావు సైతం నిర్మొహమాటంగా అనేక పర్యాయాలు సెలవిచ్చారు. ఆ మాటకొస్తే రాఘవేంద్రరావు కెరీర్ యన్టీఆర్ సినిమాతోనే మొదలయింది. యన్టీఆర్ చివరి సారి నటించిన చిత్రానికీ రాఘవేంద్రరావే దర్శకుడు కావడం మరింత విశేషం! ఈ రెండు అంశాలను పదే పదే స్మరించుకుంటారు రాఘవేంద్రరావు.

రాఘవేంద్రరావు తండ్రి కె.యస్.ప్రకాశరావు 1950లలోనే నటదర్శకనిర్మాతగా, స్టూడియో అధినేతగా, కథకునిగా రాణించారు. తండ్రి పనిచేసిన సినిమాలకు సహాయకునిగా చేసినప్పటికీ రాఘవేంద్రరావు డిగ్రీ పూర్తి కాగానే నాటి మేటి దర్శకులు కె.కామేశ్వరరావు వద్ద అసిస్టెంట్ గా చేరారు. రాఘవేంద్రరావు కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన చిత్రం యన్టీఆర్ భీమునిగా నటించిన ‘పాండవవనవాసము’. ఈ సినిమాలో తొలి సన్నివేశంగా భీమ పాత్రధారి అయిన యన్టీఆర్ పై ‘ఆంజనేయ దండకం’ వల్లించడం చిత్రీకరించారు. ఆ సీన్ కు యన్టీఆర్ పై క్లాప్ కొట్టడంతోనే రాఘవేంద్రరావు సినిమా కెరీర్ ఆరంభమయింది. ఆ తరువాత తన తండ్రి వద్ద, వి.మధుసూదనరావు దగ్గర కొన్ని చిత్రాలకు అసిస్టెంట్, అసోసియేట్, కో-డైరెక్టర్ స్థాయిల్లో పనిచేశారు రాఘవేంద్రరావు. ఆ పై శోభన్ బాబు హీరోగా ‘బాబు’ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారాయన. ఆ సినిమా తరువాత ‘జ్యోతి’ చిత్రం తెరకెక్కించి, దర్శకునిగా మంచి పేరు సంపాదించారు. అటు పై శోభన్ బాబు, జయసుధ జంటగా ‘రాజా’ చిత్రం రూపొందించారు. ఈ మూడు సినిమాల వయసు కలిగిన రాఘవేంద్రరావు తరువాతి చిత్రంతోనే యన్టీఆర్ తో ‘అడవిరాముడు’ వంటి భారీ సినిమాస్కోప్ తీసే స్థాయికి ఎదిగారు. యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘అడవిరాముడు’ అనేక రికార్డులు సృష్టించింది. స్టూడియో అవసరమే లేకుండా రూపొందిన తొలి చిత్రంగా ‘అడవిరాముడు’ నిలచింది. తెలుగునాట 30 కేంద్రాలకు పైగా ఏకకాలంలో శతదినోత్సవం చూసిన తొలి చిత్రంగా ‘అడవిరాముడు’ నిలచింది. ఇక తెలుగు సినిమాకు ప్రధాన వ్యాపారప్రాంతాలయిన ఆంధ్ర, సీడెడ్, నైజామ్, ఉత్తరాంధ్రలో స్వర్ణోత్సవం చూసిన ఏకైక చిత్రంగా ఈ నాటికీ ‘అడవిరాముడు’ నిలచే ఉంది. తెలుగునాట అంతకు ముందు,తరువాత జంగిల్ మూవీస్ రూపొందినా, ‘అడవిరాముడు’ స్థాయిలో విజయం సాధించిన సినిమా మరొకటి కానరాదు. ఇలా యన్టీఆర్ తో తాను తీసిన తొలి సినిమాతోనే అపూర్వ విజయం సాధించిన రాఘవేంద్రరావు ఆ తరువాత రామారావుతో కలసి చేసిన జైత్రయాత్రను ఎవరూ మరచిపోలేరు.

‘అడవిరాముడు’ తరువాత యన్టీఆర్ తో భారీ జానపద చిత్రంగా ‘సింహబలుడు’ రూపొందించారు రాఘవేంద్రరావు. హాలీవుడ్ సినిమా ‘స్పార్టకస్’ తరహాలో సాగే ఈ కథ రిపీట్ రన్స్ లో భలేగా జనాన్ని ఆకట్టుకుంది. యన్టీఆర్ తో రాఘవేంద్రుని మూడో చిత్రం హిందీ ‘దస్ నంబరీ’ ఆధారంగా తెరకెక్కిన ‘కేడీ నంబర్ వన్’. ఈ సినిమా జనాన్ని భలేగా మురిపించింది. ఆ పై యన్టీఆర్ తో రాఘవేంద్రరావు ‘డ్రైవర్ రాముడు’ తెరకెక్కించగా రజతోత్సవం చూసింది. ఈ సినిమా వెనువెంటనే యన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన చిత్రం ‘వేటగాడు’. ఈ చిత్రం వజ్రోత్సవం జరుపుకుంది.

అటుపై యన్టీఆర్ తో రాఘవేంద్రరావు రూపొందించిన “రౌడీ రాముడు – కొంటె కృష్ణుడు, గజదొంగ, తిరుగులేని మనిషి, సత్యం-శివం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్” చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వీటిలో ‘గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్’ వసూళ్ళ వర్షం కురిపించాయి. యన్టీఆర్ తో మొత్తం 12 చిత్రాలు తెరకెక్కించారు రాఘవేంద్రరావు. వీటిలో ‘తిరుగులేని మనిషి’మినహాయిస్తే అన్నీ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటిన చిత్రాలే అని చెప్పవచ్చు. అంతే కాదు ఒకే సంవత్సరం(1981)లో యన్టీఆర్ తో రాఘవేంద్రరావు నాలుగు చిత్రాలు “గజదొంగ, తిరుగులేని మనిషి, సత్యం-శివం, కొండవీటి సింహం” రూపొందించారు. యన్టీఆర్, ఆయన నటవారసుడు బాలకృష్ణతోనూ, యన్టీఆర్-ఏయన్నార్ తోనూ, యన్టీఆర్ – చిరంజీవి కాంబోలోనూ, యన్టీఆర్- మోహన్ బాబుతోనూ సినిమాలు తీసి ఆకట్టుకున్న ఘనత కూడా రాఘవేంద్రరావు ఒక్కరికే దక్కింది.

యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన 12 చిత్రాలలో రెండు సినిమాలు (అడవిరాముడు, వేటగాడు) స్వర్ణోత్సవాలు చూశాయి. ‘వేటగాడు’ వజ్రోత్సవం కూడా జరుపుకుంది. “అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి” రజతోత్సవాలు చూశాయి. వీటిలో ‘కొండవీటి సింహం’ 300 రోజులకు పైగా, ‘జస్టిస్ చౌదరి’ 250 రోజులు ప్రదర్శితమయ్యాయి. ఇక యన్టీఆర్ చివరి సారి నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ను కూడా బ్లాక్ బస్టర్ గా నిలిపారు రాఘవేంద్రరావు. ఇంత సక్సెస్ ఉన్న హీరో-డైరెక్టర్ కాంబినేషన్ తెలుగునాట మరోటి కానరాదు. మే 23తో 82 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు రాఘవేంద్రరావు. ఆయన మరెన్నో వసంతాలు చూస్తూ సాగాలని ఆశిద్దాం.