FIR Filed Against Movie Producer C Kalyan in Jubilee Hills: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాతలు సి కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త కంఠంనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ భూ వివాదం జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నంబర్ 89కు సంబంధించినది.
ఈ భూమిపై ఇప్పటికే కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని జూన్ 10న కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ.. నిందితులు అక్రమంగా స్థలంలోకి ప్రవేశించినట్లు రవిశంకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాళాలు పగులగొట్టి గేటును ధ్వంసం చేయడంతో పాటు.. అక్కడ ఉన్న సామగ్రిని చెల్లాచెదురు చేశారని ఆరోపించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించి.. స్థలంలో నిర్మించిన గదిని కూడా ధ్వంసం చేసినట్లు రవిశంకర్ ఫిర్యాదులో వెల్లడించారు.
రవిశంకర్ ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు సినీ నిర్మాతలు సి కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. భూ వివాదం, కోర్టు ఉత్తర్వులు, ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని రవిశంకర్‌కు పోలీసులు హామీ ఇచ్చారు. ఈ స్థల కబ్జా యత్నం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

