NTV Telugu Site icon

Jean-Luc Godard: ‘ఫ్రెంచ్ న్యూ వేవ్’కు ఆద్యుడు జీన్ లూక్ గొడార్డ్!

Hollywood

Hollywood

Jean-Luc Godard: ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు జీన్ లూక్ గొడార్డ్ మంగళవారం కన్నమూశారు. నిజానికి ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ‘లీనియర్ ఫార్మాట్’లో తెరపై కథను పలికించాలని తపించారు. ఆ తరువాతే ‘నాన్-లీనియర్’ వచ్చింది. కథ అన్నది మొదలు, నడక, ముగింపు అన్న అంశాలపైనే ఆధారపడినా, ఆ వరుసను మార్చి కథ చెబితేనే కొత్తగా ఉంటుందని చాటిన ఘనుడు ఫ్రాన్స్ దర్శకుడు జీన్ లూక్ గొడార్డ్. అదే ఆయన బాణీగా మారింది. ‘ఫ్రెంచ్ న్యూ వేవ్’ సినిమాకు తెర తీసింది. ఏ విషయంలోనైనా పట్టు సాధించాలంటే దాని ప్రాథమిక సూత్రాలు తప్పని సరిగా నేర్చుకోవాలని, ఆ తరువాత వాటినే అధిగమించాలని అప్పుడే మనలోని సృజనాత్మకత బయటకు వస్తుందని గొడార్డ్ భావించేవారు. ఫిలిమ్ క్రిటిక్ గా ఆయన అనేక చిత్రాలను శల్యపరీక్ష చేసి, వాటిలోని సాంకేతిక, నటీనటులు ప్రతిభను – లోపాలనూ రెండింటినీ జనం ముందు నిలిపేవారు. క్రిటిక్స్ కు ఓ గ్రామర్ నేర్పిన ఘనత కూడా గొడార్డ్ దే అనేవారు ఎందరో ఉన్నారు. అలాంటి గొడార్డ్ తన 91వ యేట సెప్టెంబర్ 13న తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా గొడార్డ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. శోకసముద్రంలో మునిగారు.

జీన్ లూక్ గొడార్డ్ 1930 డిసెంబర్ 3న ప్యారిస్ లో జన్మించారు. ఆయన తండ్రి పాల్ గొడార్డ్ డాక్టర్. సంపన్న కుటుంబంలో జన్మించడం వల్ల చిన్నతనం నుంచీ గొడార్డ్ ఏది కావాలంటే అది సమకూరింది. అతనికి బాల్యంలో సినిమాలంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయితే ప్రముఖ ఫ్రెంచి రచయిత ఆండ్రే మల్రాక్స్ రాసిన ‘ఔట్ లైన్ ఆఫ్ ఏ సైకాలజీ ఆఫ్ సినిమా’ వ్యాసం చదివాక గొడార్డ్ కు సినిమాలపై ఆసక్తి పెరిగింది. 1948లో డిగ్రీ పాస్ కాలేక పోయారు గొడార్డ్. ఆ సమయంలో ఆయన సోదరి రేచల్ పెయింటింగ్స్ లో గొడార్డ్ ను ప్రోత్సహించారు. అబ్ స్ట్రాక్ట్ ఫామ్ లో ఆర్ట్ వేయడమంటే గొడార్డ్ కు ఎంతో ఇష్టం. తరువాత డిగ్రీ ఎలాగోలా గట్టెక్కి, ఆపై ఆంథ్రపాలజీలో చేరారు. కానీ, క్లాసులకు వెళ్ళలేదు. ప్యారిస్ లోని సినిమా క్లబ్ లకు వెళ్ళేవారు. అక్కడ సినిమా టెక్నాలజీపై పరిజ్ఞానం సంపాదించారు. తన మిత్రులతో కలసి ‘గజెట్ డు సినిమా’ అనే మేగజైన్ ఆరంభించారు గొడార్డ్. అందులో గొడార్డ్ చేసే సునిశిత విమర్శలు అందరినీ ఆకట్టుకొనేవి. అయితే కొందరు ఒక్క అడుగు సినిమా తీసి చూడు అప్పుడు తెలుస్తుంది అని ఎద్దేవా చేసేవారు. దాంతో లఘు చిత్రాలు రూపొందించడం మొదలెట్టారు గొడార్డ్. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశాక 1960లో గొడార్డ్ తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిలిమ్ ‘బ్రెత్ లెస్'(Breathless) సినీ గోయర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. హాలీవుడ్ జనం సైతం గొడార్డ్ ‘బ్రెత్ లెస్’ చూసి ఊపిరి బిగబట్టారు. అందులో గొడార్డ్ ప్రదర్శించిన కెమెరా వర్క్, ఎడిటింగ్ స్టైల్ ఇట్టే సినీప్రియులను కట్టిపడేశాయి. ఈ సినిమాతోనే ఫ్రెంచ్ న్యూవేవ్ మొదలైందని చెప్పవచ్చు. మానవ జీవితాల్లోని అన్ని కోణాలను తన సినిమాల్లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారాయన. అలాగే సమకాలీన రాజకీయాలపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. ఆ తరువాత గొడార్డ్ ప్రపంచప్రఖ్యాత దర్శకుడై పోయారు. ఆయన సినిమాలను రీమేక్ చేయాలని హాలీవుడ్ జనం తహతహలాడేవారు. అంతలా పాపులారిటీ సంపాదించిన గొడార్డ్ ఇప్పటికీ సినీప్రియుల టాప్ టెన్ డైరెక్టర్స్ లిస్ట్ లో చోటు సంపాదిస్తూనే ఉండడం విశేషం!

తన చిత్రాలలో నాయికగా నటించిన అన్నా కరినాను పెళ్ళాడి ఐదేళ్ళకే విడిపోయారు గొడార్డ్. ఆ తరువాత మరో నటి అన్నే వైజెమ్ స్కీని పెళ్ళాడి ఓ పుష్కరకాలం కాపురం చేశారు. తరువాత తనకు నచ్చిన వారితో సహజీవనం సాగించారు. ఫీచర్ ఫిలిమ్స్ తో యావత్ ప్రపంచాన్నీ ఆకట్టుకున్న గొడార్డ్ షార్ట్ ఫిలిమ్స్ నూ ఎప్పుడూ వదల్లేదు. చివరి దాకా లఘు చిత్రాలను తెరకెక్కిస్తూనే ఉన్నారు. ఆయన ఫీచర్ ఫిలిమ్స్ లో “ఏ ఉమన్ ఈజ్ ఏ ఉమన్, మై లైఫ్ టు లివ్, ద లిటిల్ సోల్జర్, ద కరబినీర్స్, బ్యాండ్ ఆఫ్ ఔట్ సైడర్స్, వీకెండ్” వంటివి సినీగోయర్స్ మదిలో నిలచే ఉన్నాయి. 2022 సెప్టెంబర్ 13న స్విట్జర్లాండ్ – రోలే లోని తన నివాసంలో గొడార్డ్ కన్నుమూశారు. న్యూ వేవ్ సినిమాను అధ్యయనం చేసేవారందరికీ గొడార్డ్ పేరు చిరస్మరణీయం. ఈ తరం వారినీ గొడార్డ్ చిత్రాలు అలరిస్తూనే ఉండడం విశేషం!