కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన అన్ని భాషల్లోను ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడు. దాంతో ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. వారిలో ముందుగా మాట్లాడాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గురించి. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత హైలెట్‌గా నిలిచిందో అందరికి తెలిసిందే. హీరో ఎలివేషన్ సీన్లో, సెంటిమెంట్స్ సీన్లో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు రవి బస్రూర్. ఈ సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత కూడా.. ఆ మ్యూజిక్ ఇంకా మన చెవుల్లో మోగుతుందంటే.. అదంతా మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనమే అని చెప్పాలి. దాంతో ఇప్పుడు అంతా ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెజియఫ్ టు ఎడిటర్ గురించి. ఈ సినిమాకి ఎడిటర్ గా పని చేసింది ఓ 19 ఏళ్ల కుర్రాడని అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ ఎడిటింగ్ చేసుకునే ఉజ్వల్ కులకర్ణి అనే కుర్రాడిని.. ప్రశాంత్ నీల్ పిలిచి మరీ కేజీఎఫ్ 2 సినిమాని అతని చేతిలో పెట్టారు. చాలా మంది వద్దని వాదించిన ప్రశాంత్ నీల్ అతన్నే ఫైనల్ చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. ఆ కుర్రాడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. దాంతో ఇప్పుడు ఉజ్వల్ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉజ్వల్ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. తనకు ఎలా ఆఫర్ వచ్చిందనే విషయం చెప్పాడు ఉజ్వల్. ప్రశాంత్ నీల్, యశ్ సర్ లతో కలిసి పని చేశానంటే.. ఇప్పటికి నమ్మలేకపోతున్నాని అన్నాడు. అలాగే ‘సలార్ సినిమాకి వర్క్ చేయమని ప్రశాంత్ సార్ అడిగారు. నేను ఓకే చెప్పాను.. అయితే నేను ఈ సినిమాకి సోలో ఎడిటర్‌గా చేస్తానా.. లేదా ఇంకా ఎవరైనా వర్క్ చేస్తారా.. అనే విషయం క్లారిటీ లేదని చెప్పుకొచ్చాడు. దాంతో సలార్‌కు కూడా ఉజ్వల్‌నే ఎడిటర్‌గా తీసుకోవడం పక్కా అంటున్నారు. మరి సలార్‌లో ప్రభాస్ ఎలివేషన్ ఎలా ఉంటుందో చూడాలి.
