NTV Telugu Site icon

రివ్యూ: ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ (ఆహా)

అడల్ట్ కంటెట్ తో వస్తున్న హిందీ వెబ్ సీరిస్ కు యువత నుండి ఆదరణ లభిస్తోందనే వార్తలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. దాంతో ఆ తరహా వెబ్ సీరిస్ లను తెలుగులోనూ తీస్తే బాగుంటుందనే భావన మన వాళ్ళకూ కలిగినట్టుంది. ఇంతవరకూ లవ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, పొలిటికల్ థ్రిల్లర్స్ కు పరిమితమైన తెలుగు దర్శక నిర్మాతలు… ఓ అడుగు ముందుకేసి ఆడల్ట్ కంటెంట్ వైపు దృష్టి సారించారు. అలా తీసిన వెబ్ సీరిసే ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. ఆరు ఎపిసోడ్స్ తో సాగే ఈ వెబ్ సీరిస్ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ విషయానికి వస్తే ఆది (ప్రియదర్శి) డ్రైవర్. అతని తండ్రి చిన్నప్పుడే భార్యాబిడ్డలను వదిలేసి వెళ్ళిపోతాడు. తల్లి మరణించాక వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో గోదావరి తీరంలో రిసార్ట్ పెట్టుకోవాలని ఆది ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే ఊరిలో ఉండే అయ్యప్ప (పోసాని)కు అమ్మాయిల బలహీనత. మీనా (నందినీ రాయ్) అనే అందమైన అమ్మాయి మెడలో తాళి కట్టి, ఊర్లో కాపురం పెడతాడు. రిసార్ట్స్ లో బ్లూ ఫిల్మ్స్ తీస్తూ డబ్బులు గడిస్తుంటాడు. అదే సమయంలో హైదరాబాద్ లో దందాలు చేసే ఫకీర్ భాయ్ (ఉమామహేశ్వరరావు) ఓ వ్యక్తిగత సమస్యలో చిక్కుకుని తన దగ్గర ఉన్న హవాలా డబ్బు 5 కోట్ల రూపాయలను అయ్యప్ప తమ్ముడు విష్ణు (చంద్రకాంత్ దత్)కు ఇచ్చి రాజమండ్రి చేర్చమని చెబుతాడు. థామస్ (వికాస్) అనే కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న అయ్యప్ప భార్య మీనా ఒకరోజు భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది.

వీరిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో అయ్యప్ప భార్య చేతిలోనే హత్యకు గురవుతాడు. అక్కడి నుండీ ఈ వెబ్ సీరిస్ ఊహించని మలుపులు తిరుగుతుంది. అయ్యప్పను హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలని కొందరు, హవాలా సొమ్ము ఐదు కోట్లు ఎక్కడికి పోయాయో తెలియక మరికొందరు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. చిత్రం ఏమంటే… ఆరు ఎపిసోడ్స్ పూర్తయ్యే సరికీ కూడా ఓ ముగింపు అనేది లభించదు. నిజం చెప్పాలంటే… ఇందులో ఏ పాత్రకూ విలువలు అనేవి ఉండవు. అక్రమ సంబంధాలు, అక్రమార్జన, డ్రగ్స్ ఎడిక్ట్, మతంతో వ్యాపారం చేయడం, వ్యభిచారం, ప్రేమించిన వాళ్ళనే మోసగించడం… ఇలాంటి అంశాలతోనే పాత్రలన్నీ ముడిపడి ఉంటాయి. ఓవర్ ఆల్ గా చెప్పుకోవాలంటే… పతనమైన పాత్ర వెతలే ఈ వెబ్ సీరిస్.

ఆహా లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుండి ఓ వెబ్ సీరిస్ వస్తోందంటే సహజంగానే వీక్షకులలో కొన్ని అంచనాలు ఉంటాయి. పైగా ప్రియదర్శి, నందినీ రాయ్, పోసాని వంటి వాళ్ళు నటిస్తున్నారంటే… ఓ స్థాయిలో అది ఉంటుందని భావిస్తారు. కానీ అపరిమితమైన బూతులు, వల్గర్ సీన్స్ తో ఇది నిండిపోయి, వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అవసరం ఉన్నా, లేకపోయిన కొన్ని పాత్రలు మాట్లాడే తీరు చూస్తే… సహజత్వం పేరుతో ఇంతగా దిగజారి పోయారేమిటీ? అనే భావన కలుగుతుంది. 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకే ఈ వెబ్ సీరిస్ అని మేకర్స్ తెలిపినా, ఆ వయసు వాళ్ళు సైతం ఇబ్బంది పడే భాష ఇందులో ఉపయోగించారు. అంతేకాదు… కథలో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. సన్నివేశాలలో బలంలేదు. పాత్రలకు ఔచిత్యమే లేదు. ఫకీర్ హవాలా సొమ్మును రాజమండ్రికి పంపాలనుకోవడం, చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన ఆది తండ్రి తిరిగి రావడం, అయ్యప్ప తమ్ముడు విష్ణు ప్రేమ వ్యవహారం, చర్చి ఫాదర్ కొడుకు థామస్, రఫెలా మధ్య సాగే వికృత శృంగారం… ఇవన్నీ కూడా వెబ్ సీరిస్ స్థాయిని ఏ మాత్రం నిలబెట్టేవి కాదు.

‘ఆదిపర్వం, బిగ్ బ్యాంగ్, లాస్ట్ అండ్ ఫౌండ్, నయీ జిందగీ, వివాహ భోజనంబు, ఉద్యోగ పర్వం’ అంటూ ఆరు ఎపిసోడ్స్ కు ఆరు పేర్లు పెట్టారు. ఈ వెబ్ సీరిస్ కి పెట్టిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనేదే సూటబుల్ కాదు. అలానే ఒకటి రెండు ఎపిసోడ్స్ కు తప్పితే మిగిలిన ఎపిసోడ్స్ కూ ఆ యా పేర్లు సెట్ కాలేదు. మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్తంత ఆసక్తిని కలిగించినా, ఆ తర్వాత వెబ్ సీరిస్ ట్రాక్ తప్పేసింది. ఎటు వెళుతోందో అర్థం కాని పరిస్థితి. శత్రువులైన ఆది, థామస్ కలిసి గంజాయి వ్యాపారం చేయడం ఏమిటో అర్థం కాదు. అలానే ఇన్ ది నేమ్ ఆఫ్‌ గాడ్ అనే పేరు పెట్టాం కదాని మధ్యలో హిందూ మతస్థుడి కొడుకు క్రీస్టియన్ గా కన్వర్ట్ కావడం, అతని కొడుకు మాత్రం హిందువుగానే ఉండటం, చివరిలో హిందువైన తండ్రి అంత్యక్రియలను ఆయన భావాలకు విరుద్ధంగా కొడుకు క్రైస్తవ పద్థతిలో చేయడం… ఇదో ఉప కథ.

నటన విషయానికి వస్తే… అంతా వారి వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. పాత్రలోని వేరియేషన్స్ ను అర్థం చేసుకుని ప్రియదర్శి చక్కగా చేశాడు. అయితే అతని పాత్ర కూడా తాడు బొంగరం లేకుండా సాగిపోయింది. నందినీరాయ్ తనలోకి ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇక మీదట ఆమెకు మంచి పాత్రలు లభించే ఆస్కారం ఉంది. పోసాని ఎప్పటిలానే తనదైన శైలిలో నటించాడు. వికాస్.. థామస్ పాత్రకు, చంద్రకాంత్ దత్… విష్ణు పాత్రకు చక్కని న్యాయం చేశారు. రోసిగా ప్రముఖ స్టేజ్ యాక్టర్ మహ్మద్ అలీ బేగ్ బాగా చేశాడు. అయితే కొన్ని చోట్ల కాస్తంత ఓవర్ గా అనిపించింది! కొంతమంది తమ వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పారు. దాంతో పట్టిపట్టి మాట్లాడినట్టుగా ఉంది. అలానే కొన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పించారు. అవేమో కాస్తంత అతిగా అనిపించాయి. ఆర్టిస్టుల డబ్బింగ్ విషయంలో ఇంకాస్తంత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. మొత్తం మీద దర్శకుడు విద్యాసాగర్ ముత్తు ఏదో చేద్దామని ఏదో చేసినట్టు అనిపిస్తోంది.

సాంకేతిక నిపుణుల్లో చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. అవి ఫర్వాలేదు. కానీ బలమైన కథ అంటూ లేకుండా ఎన్ని హంగులు ఏర్పాటు చేసిన ఏం లాభం!? చిత్రం ఏమిటంటే ఆరు ఎపిసోడ్స్ తర్వాత అయినా ఈ కథకు సరైన ముగింపు పలికారా అంటే అదీ లేదు. చాలా ప్రశ్నలను సమాధానం లేదు. సీజన్ 2 లో వాటిని చూపిస్తారో లేక మరో రెండు ఎపిసోడ్స్ ను కొద్ది కాలం తర్వాత స్ట్రీమింగ్ చేస్తారో తెలియదు. ఈ వెబ్ సీరిస్ మీద కాస్తంత ఆసక్తి కలగడానికి ఓ కారణం దర్శకుడు సురేశ్ కృష్ణ. ఆయనలాంటి పాపులర్ డైరెక్టర్ ఓ వెబ్ సీరిస్ తో నిర్మాతగా మారుతున్నారంటే… అందులో ఏదో విషయం ఉండే అందరూ భావిస్తారు. కానీ ఆయన మీద పెట్టుకున్న ఆశలపై నీళ్లు కురిపించారు. ఈ వెబ్ సీరిస్ ను కుటుంబ సభ్యులతో కలిసి చూడలేం. ఒంటరిగా ఉన్నప్పుడు దీనికోసం దాదాపు నాలుగు గంటల సమయం వెచ్చించడం వేస్ట్!!

రేటింగ్ : 2 / 5

ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల నటన
సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్
అపరిమితమైన బూతులు
అర్థం లేని సన్నివేశాలు
ఆసక్తి కలిగించని స్క్రీన్ ప్లే

ట్యాగ్ లైన్: చెట్టు పేరు చెప్పి కాయలమ్మేశారు!