Site icon NTV Telugu

Yashoda: ఏవి చేయకూడదో అవన్నీ చేయాల్సి వస్తే సమంత పరిస్థితేంటీ!?

Yashoda

Yashoda

 

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’. తెలుగు, తమిళ భాషల్లో హరి, హరీశ్‌ సంయుక్త దర్శకత్వంలో ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ్టి నుండి దాదాపు 1800 థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శితం కాబోతోంది. సమంత ప్రెగ్నెంట్ అని చెప్పిన లేడీ డాక్టర్ ఆమెకు కొన్ని సలహాలూ, సూచనలు ఇస్తుంది. ఏవి చేయకూడదో వివరిస్తుంది. చిత్రం ఏమంటే… ఆ చేయకూడని పనులన్నీ యశోద తన నిజ జీవితంలో చేయాల్సి వస్తుంది. ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఆమెకు ఎదురవుతాయి. అదేమిటనేదే ‘యశోద’ కథ. దాంతో ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాను సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ‘యశోద’ ప్రస్తుతం రీ-రికార్డింగ్ దశలో ఉంది. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. హేమంబ‌ర్ జాస్తి క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మీ సంభాషణలు సమకూర్చుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.

 

Exit mobile version