Site icon NTV Telugu

HBD Jayaprada : మరపురాని అందం… జయప్రద!

Jayaprada

Jayaprada

(ఏప్రిల్ 3న జయప్రద పుట్టినరోజు)
జయప్రద అందాన్ని కీర్తించని మనసుకు రసికతలేదని చెప్పవచ్చు.. విశ్వవిఖ్యాత భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సైతం జయప్రద అందాన్ని ‘ఒన్ ఆఫ్‌ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ ఆఫ్ ద వరల్డ్’ అని కీర్తించారు. అంటే ఆ అందంలోని సమ్మోహన శక్తి ఏ పాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జయప్రద అందాన్ని చూసి ఆ రోజుల్లో ఎందరో కవిపుంగవులు తమ కలాలకు పదను పెట్టి, అరుదైన పదబంధాలతో సరికొత్త కవితలు రాసి పులకించి పోయారు.

కేవలం అందంతోనే కాదు, అభినయంతోనూ జయప్రద మురిపించిన వైనాన్ని అభిమానుల మనసులు మరచిపోలేవు. ఆరంభంలోనే “అంతులేని కథ, సిరిసిరిమువ్వ, సీతాకళ్యాణం” వంటి చిత్రాలలో జయప్రద అభినయం ఆకట్టుకుంది. ఇక ‘అడవిరాముడు’ తరువాత ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆ పైన నాటి మేటి హీరోలందరితోనూ నటించి జనానికి కనువిందు చేశారు. యన్టీఆర్ తో మరచిపోలేని, మరపురాని విజయాలను చవిచూశారు. తన కెరీర్ లో అత్యధిక చిత్రాలలో కృష్ణ సరసన నాయికగా నటించారు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోనూ జయప్రద అభినయంతో ఆకట్టుకున్నారు. ఉత్తరాదివారు సైతం జయప్రద అందాన్ని చూడగానే ఫిదా అయిపోయి, ఫ్యాన్స్ అసోసియేషన్స్ మొదలు పెట్టారు. జయప్రద నటించిన హిందీ చిత్రాలు ఆబాలగోపాలాన్నీ ఆకర్షించాయి. ముఖ్యంగా నాటి యువకులను ఓ ఊపు ఊపేశాయి. దాంతో ఉత్తరాది వారు సైతం జయప్రదకు తమ గుండెల్లో గుడి కట్టి ఆరాధించారు. అంతలేకపోతే, రెండు సార్లు ఉత్తరాది నుండి జయప్రద లోక్ సభకు ఎన్నికవుతారా చెప్పండి! అదీ ఆమె అందంలోని ఆకర్షణ.

జయప్రద ఎన్ని చిత్రాలలో నటించినా, నటరత్న యన్టీఆర్ తోనే ఆమె వైవిధ్యంగా సాగారు. యన్టీఆర్ ‘అడవిరాముడు’తో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న జయప్రద ఆయన సరసన డిఫరెంట్ జానర్స్ లో నటించి మురిపించారు. ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ వంటి పౌరాణికంలోనూ, ‘రాజపుత్ర రహస్యము’ వంటి జానపదంలోనూ, ‘చాణక్య-చంద్రగుప్త’లాంటి చారిత్రకంలోనూ యన్టీఆర్ సరసన నటించి ఆకట్టుకున్నారు. ఇక సోషియో మిథికల్ ఫాంటసీగా తెరకెక్కి అఖండ విజయం సాధించిన ‘యమగోల’లో యన్టీఆర్ తో జయప్రద వేసిన చిందు కనువిందు చేసి కనకవర్షం కురిపించింది. ఆయనతో జయప్రద నటించిన చివరి చిత్రం ‘సూపర్ మేన్’. ఈ చిత్రం తెలుగునాట సూపర్ హీరో మూవీస్ కు తెరతీసింది. ఇలా ఇన్ని రకాల వైవిధ్యమైన పాత్రలతో యన్టీఆర్ సరసన నటించిన నాయిక మరొకరు కానరారు.
చిత్రసీమలో రామారావుతో పలు వైవిధ్యమైన చిత్రాలలో నటించిన జయప్రద, ఆయన పిలుపు మేరకు 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత ఆ పార్టీలో కీలకంగానూ మారారు. ఆ పై సమాజ్ వాది పార్టీ నుండి రెండుసార్లు లోక్ సభకు ఎంపికయ్యారు. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. 2019లో బీజేపీలో చేరారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలు పోషించడానికి ఉత్సాహంగా ఉన్నారు జయప్రద. రాజేంద్రప్రసాద్ తో కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారామె. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మునుముందు ఏ తరహా పాత్రలతో జయప్రద రంజింప చేస్తారో చూడాలి.

Exit mobile version