NTV Telugu Site icon

విల‌క్ష‌ణం… ఘ‌ట్టమ‌నేని మంజుల ప‌య‌నం!

మ‌న‌సు చెప్పిందో ఎవ‌రి మాటా విన‌వ‌ద్దు – అంటారు న‌ట‌శేఖ‌ర కృష్ణ‌. ఆయ‌న కూతురు ఘ‌ట్ట‌మ‌నేని మంజుల తండ్రి మాట‌ల‌ను తు.చ‌. త‌ప్ప‌క పాటించార‌నే చెప్పాలి. పిన్న‌వ‌యసులోనే తెర‌పై క‌నిపించిన మంజుల‌లో న‌ట‌న‌పై అమితాస‌క్తి ఉండేది. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆమె రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ కాలేక‌పోయారు. ఏమ‌యితేనేమి, తాను అనుకున్న‌ది సాధించి, న‌టిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలిగా విల‌క్ష‌ణంగా సాగుతున్నారు మంజుల‌.

ఘ‌ట్ట‌మ‌నేని మంజుల 1970 నవంబ‌ర్ 8న జ‌న్మించారు. న‌ట‌శేఖ‌ర కృష్ణ రెండో కూతురు. మ‌ద‌రాసులోనే చ‌దువు సంధ్య‌లు సాగాయి. ఆమెకు ఎనిమిదేళ్ల వ‌య‌సు ఉన్న స‌మ‌యంలో 1978లో శ‌భాష్ గోపి చిత్రంలో తొలిసారి న‌టించారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు మంజుల‌. అంత పిన్న‌వ‌య‌సులోనే ఓ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టించి, జ‌నాన్ని మెప్పించారు. టీనేజ్ లో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర నుంచీ మంజుల మ‌న‌సు న‌ట‌న‌పైకి మ‌ళ్ళింది. అయితే కృష్ణ‌ను ఎంత‌గానో అభిమానించే ఫ్యాన్స్, త‌మ హీరో కూతురు మరొక‌రి స‌ర‌స‌న న‌టిస్తే చూడ‌లేమ‌ని గోల చేశారు. దాంతో కొద్ది రోజులు ఆగారు. ప్ర‌ముఖ త‌మిళ‌న‌టుడు నంబియార్ మ‌న‌వ‌డు దీప‌క్ తో క‌ల‌సి ఓ త‌మిళ చిత్రంలో న‌టించారు మంజుల‌. ఆ సినిమా ఎందుక‌నో వెలుగు చూడ‌లేదు. త‌రువాత ఆర్.కె.సెల్వ‌మ‌ణి తెర‌కెక్కించిన రాజ‌స్థాన్ చిత్రంలో ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించారు. ఈ చిత్రానికి ముందు బాల‌కృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన టాప్ హీరోలో తొలుత మంజుల నాయిక అనుకున్నారు. అయితే ఫ్యాన్స్ గోల చేయ‌డంతో ఆ ప్ర‌య‌త్నం మానుకున్నారు. త‌రువాత మ‌ళ‌యాళ సినిమా స‌మ్మ‌ర్ ఇన్ బెత్లహేమ్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి, త‌న అభిలాష‌ను నెర‌వేర్చుకున్నారు మంజుల‌. త‌రువాత తానే నిర్మాత‌గా మారి 2002లో నీల‌కంఠ ద‌ర్శ‌క‌త్వంలో షో అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రం కేవ‌లం రెండే పాత్ర‌ల‌తో సాగుతుంది. ఈ సినిమాకు ఉత్త‌మ తెలుగు చిత్రంగా నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది.

షో త‌రువాత త‌న‌కు న‌చ్చిన పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టిస్తూ సాగారు మంజుల‌. 2004లో త‌న త‌మ్ముడు మ‌హేశ్ బాబు హీరోగా ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో వైవిధ్యంగా నాని అనే సినిమా నిర్మించారు. 2006లో మ‌హేశ్ హీరోగా రూపొందిన పోకిరిలో నిర్మాణ భాగ‌స్వామిగా నిలిచారు. ఈ సినిమా అనూహ్య విజ‌యం సాధించింది. ఇప్ప‌టికీ మ‌హేశ్ బాబు కెరీర్ లో టాప్ మూవీగా నిల‌చే ఉంది. మంజుల‌ న‌టించి, నిర్మించిన కావ్యాస్ డైరీ కూడా ఓ మోస్త‌రుగా ఆక‌ట్టుకుంది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత తొలి చిత్ర‌మైన ఏ మాయ చేశావె నిర్మించారు మంజుల‌. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం త‌రువాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందిన ఆరెంజ్లో ఓ ముఖ్య‌పాత్ర‌లోన‌టించారు మంజుల‌. 2013లో తెర‌కెక్కిన సేవ‌కుడులోనూ ఆమె క‌నిపించారు. మ‌ళ్ళీ మొద‌ల‌యింది చిత్రంలోనూ మంజుల న‌టించారు. మంజుల భ‌ర్త సంజ‌య్ స్వ‌రూప్ సైతం న‌టునిగా సాగుతున్నారు. వారిద్ద‌రూ భార్య‌భ‌ర్త‌లుగానే ఆరెంజ్లో క‌నిపించారు. ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లైన జై భీమ్లో జ‌డ్జి పాత్ర‌లో క‌నిపించారు సంజ‌య్. ఆయ‌న నిర్మాత‌గా మంజుల ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరోగా మ‌న‌సుకు న‌చ్చింది అనే చిత్రం రూపొందింది. ఏది ఏమైనా మంజుల త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకొని న‌టిగా,నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలిగా విల‌క్ష‌ణంగా సాగార‌నే చెప్పాలి.