Gayam Movie: జగపతిబాబు నటజీవితంలో పలు మలుపులు ఉన్నాయి. రాగానే హీరోగా వచ్చిన జగపతిబాబు ఆ తరువాత కథానాయకునిగా మారడానికి పలు పాట్లు పడ్డారు. ఆయన హీరోగా నటించిన కొన్ని చిత్రాల్లో ఇతరుల డబ్బింగ్ తో నటించారు. విజయాలు వచ్చినా, అవి ఆయన ఖాతాలో చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగపతిబాబును హీరోగా పెట్టి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో యార్లగడ్డ సురేంద్ర ‘గాయం’ చిత్రాన్ని నిర్మించారు. తన ఫేవరెట్ మూవీస్ లో హాలీవుడ్ సినిమా ‘గాడ్ ఫాదర్’కు ఎప్పుడూ పెద్ద పీట వేసే రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా స్ఫూర్తితోనే ‘గాయం’ చిత్రాన్ని తెరకెక్కించారు. రామును ‘గాడ్ ఫాదర్’ ఎంతలా ప్రభావితం చేసిందో చెప్పడానికి ‘గాయం’లోని ప్రారంభ సన్నివేశాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ‘గాయం’ చిత్రం 1993 ఏప్రిల్ 22న విడుదలై విజయం సాధించింది.
‘గాయం’ కథ ఏమిటంటే- చట్టం తమకు న్యాయం చేయలేదు అనుకున్న వారందరూ దుర్గను ఆశ్రయిస్తూ ఉంటారు. తన దగ్గరకు చేరినవారికి నిజంగా అన్యాయం జరిగిందని భావిస్తే, దుర్గ ఎంతకైనా తెగించి, తనదైన రీతిలో వారికి న్యాయం చేస్తూ ఉంటాడు. దుర్గ చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలనే ఆశిస్తాడు. కాలేజ్ లో అనిత అనే అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. అయితే అదే సమయంలో ఆయన అన్నను వారి ప్రత్యర్థి గురు నారాయణ హత్య చేయిస్తాడు. దాంతో తన కుటుంబానికి దుర్గ అండగా నిలుస్తాడు. తన అన్న సాగిన మార్గాన్నే ఎంచుకుంటాడు. అది నచ్చని అనిత దూరంగా జరుగుతుంది. ఆమె ఓ పోలీసాఫీసర్ ను పెళ్ళాడుతుంది. తరచూ గురునారాయణ, దుర్గ గ్యాంగ్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. నగరంలో జరిగే ఘర్షణలకు కారణమైన గురునారాయణ, దుర్గ ఆటకట్టించడానికే అనిత భర్త భరద్వాజను ప్రత్యేకంగా నియమిస్తారు. అనిత ఓ పేపర్ లో జర్నలిస్టుగా పనిచేస్తుంటుంది. దుర్గ మరదలు చిత్రకు అతనంటే ప్రాణం. ఎప్పుడూ అతను చేసేది సబబే అని చెబుతూ ఉంటుంది. గురునారాయణ, దుర్గను ఎలాగైనా పట్టుకొని జైలులో పెట్టాలన్నది ఇన్ స్పెక్టర్ భరద్వాజ ఆలోచన. తన మనుషులను దుర్గ కొడుతున్నాడని తెలిసిన గురునారాయణ, ఓ సారి చిత్రను కిడ్నాప్ చేసి, దుర్గను భయపెట్టాలనుకుంటాడు. దుర్గ ఎటాక్ చేసి, చిత్రను రక్షిస్తాడు. దాంతో దుర్గను అరెస్ట్ చేయాలని చూస్తాడు భరద్వాజ. అయితే అతను స్టేషన్ లోనే ఉండి, గురు మనుషులను పైకి పంపిస్తాడు. తనకు అడ్డుగా ఉన్న దుర్గను లేపేయాలని గురు పథకం వేస్తాడు. గణేశ్ నిమజ్జనం వేడుకల్లో ఓ చోట బాంబు పెట్టించి అక్కడకు దుర్గ వచ్చేలా చేస్తాడు. దుర్గ అడ్డు లేకుంటే, తాను ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి కావచ్చునని ఆశిస్తాడు గురు. ఈ నేపథ్యంలో అసలు విషయం భరద్వాజ్ కు తెలుస్తుంది. జనానికి ప్రాణనష్టం ఉందని, తమకు సహకరించమని దుర్గను కోరతాడు. దుర్గ పోలీసులకు సహకరిస్తాడు. భరద్వాజ ప్రాణం కాపాడతాడు. చివరకు తాను పెట్టిన బాంబుకు గురు తానే బలి అవుతాడు. ఆ తరువాత తాను కూడా గొడవలు వదిలేసి కొత్తగా జీవించాలని దుర్గ భావిస్తాడు. దాంతో కథ ముగుస్తుంది.
ఇందులో దుర్గగా జగపతిబాబు, అనితగా రేవతి, చిత్రగా ఊర్మిళ మటోద్కర్, గురు నారాయణగా కోట శ్రీనివాసరావు, భరద్వాజగా శివకృష్ణ నటించారు. చరణ్ రాజ్, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణ, రామిరెడ్డి, ఎమ్.బాలయ్య, నారాయణరావు, ఉత్తేజ్, బెనర్జీ, నరసింగ్ యాదవ్, రాగిణి ఇతర పాత్రల్లో కనిపించారు. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇందులో జర్నలిస్ట్ స్వామిగా అభినయించారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం సమకూర్చగా, సీతారామశాస్త్రి పాటలు పలికించారు. ఇందులో “నిగ్గదీసి అడుగు… ఈ సిగ్గులేని జనాన్ని…” అంటూ సాగే పాటను సీతారామశాస్త్రిపై చిత్రీకరించారు. “నైజాము పోరీ…”, “అలుపన్నది ఉందా…”, “సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని…”, “చెలిమీద చిటికెడు…” అంటూ సాగే పాటలు కూడా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మతో కలసి మణిరత్నం కథను సమకూర్చడం విశేషం. పోసాని కృష్ణమురళి సంభాషణలు రాశారు. జగపతిబాబుకు అంతకు ముందు కొన్ని చిత్రాలలో ఆయన గొంతు బాగోలేదని ఘంటసాల రత్నకుమార్ తో డబ్బింగ్ చెప్పించారు. ఈ సినిమాలో జగపతిబాబు సొంతగొంతుతో నటించి ఆకట్టుకోవడంతో ఆ తరువాత తన స్వరం వినిపిస్తూనే సాగారు. ‘గాయం’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని సన్నివేశాలను పోలినవే రామ్ గోపాల్ వర్మ తరువాత హిందీలో తాను అమితాబ్ బచ్చన్ తో తెరకెక్కించిన ‘సర్కార్’లో కనిపిస్తాయి.
ఈ చిత్రం ఆరు నంది అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయనటిగా ఊర్మిళ, ఉత్తమ విలన్ గా కోట శ్రీనివాసరావు, ఉత్తమ గీతరచయితగా సీతారామశాస్త్రి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రసూల్ ఎల్లోర్, బెస్ట్ఎడిటర్ గా శంకర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్ గా శ్రీనివాస్ నందులు అందుకున్నారు. ఈ సినిమా విడుదలైన 17 సంవత్సరాలకు సీక్వెల్ గా ‘గాయం-2’ను ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ నిర్మించారు.