Four Movies Coming From Producer Allu Aravind: ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్, జీఎ2, అల్లు ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు తమ వేగాన్ని పెంచాయి. ఇప్పుడు పలు చిత్రాలను ఈ సంస్థలు నిర్మిస్తున్నాయి. విశేషం ఏమంటే… ఈ బ్యానర్స్ కు చెందిన ఏకంగా నాలుగు సినిమాలు ప్రస్తుతం సెట్స్ లో వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది హిందీ సినిమా ‘షెహజాదా’. అల్లు అర్జున్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ కు ఇది రీమేక్. కార్తిక్ ఆర్యన్, కృతీసనన్ జంటగా రోహిత్ ధవన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ సినిమాను భూషన్ కుమార్, అమన్ గిల్, కృష్ణన్ కుమార్ తో కలిసి హిందీలో నిర్మిస్తున్నారు. ఇది వచ్చే యేడాది వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. అలానే అల్లు అరవింద్ తన మూడో కొడుకు శిరీష్ హీరోగా ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఈ సినిమా నవంబర్ 4న జనం ముందుకు రాబోతోంది. అలానే యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరంతో జీఏ 2 సంస్థ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీని నిర్మిస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న దీని విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. అలానే జీఏ 2 సంస్థకు చెందిన ప్రొడక్షన్ 8 కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీని ‘జోహార్’, ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాల దర్శకుడు తేజ మర్ని రూపొందిస్తున్నాడు. దీనికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పేరుతో పాటు విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. ఇలా ఒకే సమయంలో అల్లు అరవింద్ నాలుగు సినిమాలను నిర్మిస్తున్నారు. అంతేకాదు పలు ప్రాజెక్ట్స్ సైతం చర్చల దశలో ఉన్నాయి.
