నటరత్న యన్.టి.రామారావు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలకు కో-డైరెక్టర్ గా వ్యవహరించారు నందమూరి రమేశ్. ఆయనను దర్శకునిగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘మా ఇద్దరి కథ’. ఈ సినిమాను కానూరి రంజిత్ కుమార్, కె.గోపాలకృష్ణ తమ ఆదర్శ చిత్ర పతాకంపై నిర్మించారు. 1977 సెప్టెంబర్ 23న ‘మా ఇద్దరి కథ’ విడుదలయింది.
‘మా ఇద్దరి కథ’ విషయానికి వస్తే – సత్యం, విశ్వం ఒకే పోలికలతో ఉన్న అన్నదమ్ములు. డిగ్రీలు పూర్తి చేస్తారు. కానీ, వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించవు. నీతి, నిజాయతీ అంటూ ఉంటాడు సత్యం. కన్నతల్లి ప్రాణాలు కాపాడుకోలేని నీతి, నిజాయతీ ఎందుకని ప్రశ్నిస్తాడు విశ్వం. ఇద్దరి దారులు వేరవుతాయి. సత్యం తన పాత మిత్రులతో కలసి ఉద్యోగాల వేటలో ఉంటాడు. విశ్వం మాయలు చేసి, బడాబాబుల భరతం పట్టి ధనవంతుడవుతాడు. అప్పుడు కృష్ణ అనే పేరుతో చెలామణీ అవుతూ ఉంటాడు. గీత అనే అమ్మాయి పాటలు పాడుతూ, తన అసిస్టెంట్లతో జేబులు కొట్టే పని చేయిస్తూ ఉంటుంది. సత్యంతో పరిచయం అయ్యాక నీతిగా బ్రతకాలనుకుంటుంది గీత. సత్యం తన మిత్రులతో కలసి ఓ కాబూలీవాలా ఇంట్లో ఉంటాడు. అతని కూతురు సత్యంను, అతని మిత్రులను సొంత అన్నలుగా భావిస్తూ ఉంటుంది. సీత అనే అమ్మాయి ఆపదలో ఉంటే విశ్వం రక్షిస్తాడు. ఆ తరువాత కృష్ణ, సీతను చేరదీస్తాడు. అతనికి అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఆ నగరంలో బడాబాబులుగా చెలామణీ అయ్యే ముగ్గురి వల్లే జనం కష్టాల పాలవుతుంటారు. దానిని అరికట్టే ప్రయత్నంలో సత్యం దిగుతాడు. అతనికి ఆ ముగ్గురూ అడ్డంకులు కల్పిస్తారు. చివరకు సత్యంను అన్నగా భావించే అమ్మాయిని చంపేస్తారు. దాంతో సత్యం కూడా వారిని అంతమొందించాలని భావిస్తాడు. కానీ, నీతికి నిలబడిన తన అన్నకు నెత్తురు అంటకుండా ఆ ముగ్గురినీ తానే చంపేస్తాడు కృష్ణ. చివరకు నీతిదే ఏ నాటికైనా గెలుపు అవుతుందని అన్నతో చెప్పి, జైలుకు వెళతాడు విశ్వం. జైలుకు వెళ్తున్నవిశ్వాన్ని చూస్తూ ఉన్న సత్యం, గీత దగ్గరకు సీత రావడంతో కథ ముగుస్తుంది.
ఇందులో గీతగా మంజుల, సీతగా జయప్రద నటించారు. రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, రాజబాబు, ప్రభాకర్ రెడ్డి, రమణమూర్తి, ముక్కామల, మాడా, సారథి, కాకరాల, పండరీబాయి, రోజారమణి, హలం ఇతర ముఖ్యపాత్రధారులు. కొన్ని హిందీ చిత్రాలను మిళితం చేసి ఈ కథను కె.గోపాలకృష్ణ రూపొందించారు. ఎమ్.గోపి ఈ సినిమాకు మాటలు అందించారు. చక్రవర్తి స్వరకల్పనలో ఆత్రేయ, కొసరాజు, దాశరథి, వేటూరి, గోపి పాటలు పలికించారు. “మంచిని సమాధి చేసేసెయ్…”, “చిలకపచ్చ కోకచుట్టి…”, “చలిచలిగా ఉందిరా…హోయ్ రామా…”, “అనురాగంతో బంధం వేసే అందాలచెల్లీ…”, “నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను…”, “నేనెవరో మీకు తెలుసా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
యన్టీఆర్ ‘అడవిరాముడు’గా జైత్రయాత్ర సాగిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో ఆయన నటించిన ఇతర చిత్రాలలో ‘యమగోల’ ఒక్కటే తట్టుకోగలిగి విజయకేతనం ఎగురవేయగలిగింది. 1977లోనే వచ్చిన యన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘దానవీరశూర కర్ణ, చాణక్య-చంద్రగుప్త’కు నందమూరి రమేశ్ దర్శకత్వ విభాగంలో పనిచేశారు. అదే యేడాది నందమూరి రమేశ్ దర్శకునిగా ‘మా ఇద్దరి కథ’తో పరిచయం కావడం విశేషం! కాగా, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత యన్టీఆర్, రజనీకాంత్ తో ‘టైగర్’ సినిమానూ రమేశ్ రూపొందించారు. ఆ చిత్రం కూడా అంతగా అలరించలేదు. తరువాత బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అల్లరి క్రిష్ణయ్య’కు నందమూరి రమేశ్ దర్శకత్వం వహించారు.