Folk Song In Abhiram Movie Getting Applause: యశ్ రాజ్, ‘నాంది’ ఫేమ్ నవమి గాయక్ జంటగా నటిస్తున్న సినిమా ‘అభిరామ్’. రామకృష్ణార్జున్ దర్శకత్వంలో దీనిని జింకా శ్రీనివాసులు నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్థంగా ఉన్న ఈ సినిమాలోని ఓ గీతాన్ని ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల, ఓ సైదులో సైదులా నా గుండె గుంజు కెళ్ళే’ అంటూ సాగే ఈ జానపద గీతాన్ని సాగర్ నారాయణ రాయగా, మీనాక్షి భుజంగ్ దీనిని స్వరపరిచారు. అంతే గొప్పగా ఉమా నేహా, సింహా దీనిని గానం చేశారు.
హీరో హీరోయిన్లు యశ్ రాజ్, నవమిపై చిత్రీకరించిన ఈ పాటకు చంద్రకిరణ్ నృత్య రీతులు సమకూర్చారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా గురించి నిర్మాత జింకా శ్రీనివాసులు మాట్లాడుతూ, ”లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ కలయికలో వినూత్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని అన్నారు.
