NTV Telugu Site icon

MBU: మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిల్మ్ అకాడమి!

Mbu

Mbu

Mohan Babu: సీనియర్ నటులు, నిర్మాత, విద్యారంగ నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎం. మోహన్ బాబు 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా విస్తరించింది. శ్రీ విద్యానికేతన్ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోహన్ బాబు యూనివర్సిటీని సకల సదుపాయాలతో మోహన్ బాబు నిర్మించారు. శ్రీ విద్యానికేతన్ 30వ క్రీడా దినోత్సవాన్ని పురస్కారించుకుని హైదరాబాద్ లోని సినీ పాత్రికేయులను మోహన్ బాబు తిరుపతికి ఆహ్వానించారు. జనవరి 7వ తేదీ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తుడా వైస్‌ ఛైర్మన్ హరికృష్ణ, ఎంబియు ప్రో ఛాన్స్ లర్ మంచు విష్ణు, ఎంబియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ మహేశ్వరి, వీసీ నాగ రాజారాం రావు, రిజిస్ట్రార్ సారధి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ప్రతిభా పాటవాలను, క్రీడానైపుణ్యాన్ని వీక్షించారు. తన విద్యాలయాలలో విద్యను అభ్యసించే ప్రతి ఒక్కరూ దేశం గర్వించే పౌరులుగా నిలవాలనే ఆకాంక్షను ఎం.బి.యు. ఛాన్స్ లర్ మోహన్ బాబు వ్యక్తం చేశారు. దీనికి ముందు మోహన్ బాబు యూనివర్సిటిలోని వివిధ విభాగాలను, అందులోని ప్రత్యేకతలను మీడియా ప్రతినిధులకు ఆయన సవివరంగా తెలియచేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఏర్పాటు చేసిన మూడు అంతస్తుల లైబ్రరీ, దాసరి నారాయణరావు పేరుతో ఏర్పాటు చేసిన విశాలమైన ఏసీ ఆడిటోరియంను చూసి అందరూ మోహన్ బాబును ప్రత్యేకంగా అభినందించారు. మ్యాన్ పవర్ తో సంబంధం లేకుండా దాదాపు 40 వేల మందికి రకరకాల వంటకాలను అతి తక్కువ సమయంలో రుచికరంగా తయారు చేసే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటోమేటిక్ కిచెన్ అందరినీ అబ్బురపరిచింది. దీనిని మంచు విష్ణు ప్రత్యేకంగా డిజైన్ చేయడం విశేషం.

జనవరి 8, 9 తేదీలతో మీడియా ప్రతినిధులకు తిరుమల శ్రీవారి దర్శనానికి మోహన్ బాబు ఏర్పాట్లు చేశారు. వారితో పాటే మోహన్ బాబు, విష్ణు తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తొలిసారి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి 11వ తేదీ వరకూ అనుమతించడంతో స్వామి వారి దర్శన భాగ్యం దివ్యంగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ముందంజలో ఉండాలని తాను స్వామి వారిని ప్రార్థించినట్టు మోహన్ బాబు తెలిపారు. అనంతరం ఎంబియు ప్రాంగణంలో గత యేడాది విగ్రహ ప్రతిష్ఠ జరిగిన షిరిడీ సాయినాధుని మందిరాన్ని మీడియా ప్రతినిధులు దర్శించుకున్నారు. ఆ మందిర నిర్మాణ విశేషాలను మోహన్ బాబు స్వయంగా తెలియ చేశారు. భారతీయ జ్యోతిష్య శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని గ్రహ, నక్షత్ర, రాశి లగ్న దోషాలు తొలగి, సకల శుభాలు చేకూరేలా ఓ వనాన్ని ఈ మందిరం పక్కనే ఏర్పాటు చేయడం విశేషం. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మోహన్ బాబు ఫిల్మ్ అకాడమి!
మోహన్ బాబు 1992లో శ్రీ విద్యా నికేతన్ ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్ ను ప్రారంభించారు. 1996లో డిగ్రీ కాలేజీని నెలకొల్పారు. 2004లో ఫార్మసీ, 2006లో నర్సింగ్ కాలేజీలు మొదలయ్యాయి. ఆ తర్వాత సంవత్సరమే శ్రీ విద్యానికేతన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ను నెలకొల్పారు. గత యేడాది యూనివర్సిటీగా మారిన తర్వాత మరిన్ని కోర్సులను, విభాగాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది మోహన్ బాబు ఫిల్మ్ అకాడమి. యాభై సంవత్సరాలుగా చిత్రసీమతో అనుబంధం ఉన్న మోహన్ బాబు తన యూనివర్సిటీలో ‘మోహన్ బాబు ఫిల్మ్ అకాడమి’ని ఏర్పాటు చేశారు. ఇందులో సినిమా రంగానికి సంబంధించిన ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్, స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీలో డిప్లొమా కోర్సులు, డిగ్రీ పట్టా ఇవ్వనున్నారు. దీనితో పాటే కాస్ట్యూమ్‌ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు ఏర్పాటు చేశారు. సీనియర్ నటుడిగా, నిర్మాతగా దశాబ్దాల అనుభవం ఉన్న మోహన్ బాబు, ఆయన నట వారసుల ఆధ్వర్యంలో ఈ ఫిల్మ్ అకాడమి రాబోయే రోజుల్లో చక్కని నటీనటులను, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను తయారు చేస్తుందనడంలో సందేహం లేదు.

Show comments