సురేశ్ బాబు, తాటి సునీత సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘దొంగలున్నారు జాగ్రత్త’. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి, ప్రీతి అస్రాణి ఇందులో ప్రధాన భూమిక పోషించారు. సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహించారు. కాల భైరవ సంగీతం అందించారు. ఈ నెల 23న సినిమా జనం ముందుకు రాబోతున్న సందర్భంగా ప్రీతి మీడియాతో తన మనసులోని భావాలను పంచుకుంది.
బాలనటిగా రెండు మూడు చిత్రాలలో నటించిన ప్రీతి హీరో సుమంత్ ‘మళ్ళీరావా’ మూవీ తర్వాత ‘ప్రెజర్ కుక్కర్, ఆడ్ ఇన్ఫినిటమ్, సీటీమార్’ చిత్రాలలో చేసింది. తన తాజా చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ లోని పాత్ర గురించి చెబుతూ, ‘ఇది చాలా యూనిక్ కథ. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ కూడా వుంది. ఇందులో నీరజ పాత్రలో కనిపిస్తాను. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయి వుంటాయి. ప్రతి మహిళా ఆ పాత్రకు కనెక్ట్ అవ్వగలుగుతారు.ఎందుకంటే ఇందులో మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే నేచురల్ సీన్స్ వుంటాయి. నా పాత్ర నిడివి తక్కువగా వున్నప్పటికీ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. దర్శకుడు సతీష్ ఈ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. నటనకు ఆస్కారం ఉంది. ఆ పాత్ర చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది” అని తెలిపింది. తన మనసుకు ఈ పాత్ర బాగా నచ్చిందని చెబుతూ, ”నీరజ ప్రపంచానికి నాకు ఒక పోలిక వుంది. మేం ఇద్దరం చాలా స్ట్రాంగ్. నీరజ ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. నాలో కూడా ఆ గుణం వుంది. అలాగే నీరజలో మొండితనం కూడా ఎక్కువే. నాలో కూడా కొంచెం మొండితనం వుంది” అని తెలిపింది. దర్శకుడు సతీశ్ గురించి తెలుపుతూ, ”ఆయన మంచి విజన్ వున్న దర్శకుడు. సీన్ ని చాలా వివరంగా చెప్తారు. టీంతో ఎంతో ఆప్యాయంగా వుంటారు. శ్రీసింహతో పని చేయడం మంచి అనుభవం. చాలా కూల్ గా, ఎంతో అణుకువతో వుంటారు. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే టెక్నికల్ టీం గ్రేట్ అవుట్ పుట్ ఇచ్చారు. సముతిర ఖని, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి బ్రిలియంట్ నటులతో పని చేయడం కూడా గొప్ప అనుభవం” అని చెప్పింది.
నటి అంజు అస్రాణి సోదరి అయిన ప్రీతి గుజరాతీ అమ్మాయి. ఐదేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి వచ్చాక తెలుగు నేర్చుకుని సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అక్క గైడ్ లైన్స్ లోనే తాను సాగుతున్నానని, అందుకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో ఉందని, పాత్రలను ఎంచుకునేప్పుడే కొన్ని పరిమితులను విధించుకుంటాన’ని ప్రీతి తెలిపింది. మీనింగ్ ఫుల్ పాత్రలు చేయాలనేదే తన లక్ష్యమని, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టమని, సమంత, సాయి పల్లవి చేసేలాంటి సినిమాలు చేయాలన్నది తన అభిమతమని, ‘యశోద’లో తానో క్యామియో రోల్ చేశానని ప్రీతి చెప్పింది. తమిళంలో రెండు, తెలుగులో ఒక సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ వారి వెబ్ సీరిస్ లోనూ నటిస్తున్నట్టు ప్రీతి తెలిపింది.
