Site icon NTV Telugu

Dhurandhar: ధురంధర్ సినిమా.. నిజజీవితంలో రహమాన్ డకైత్‌ను చౌదరి అస్లాం ఎలా ఎన్‌కౌంటర్ చేశారు.?

Dhurandhar

Dhurandhar

Dhurandhar: రణ్‌వీర్ సింగ్ నటించిన ‘‘ధురంధర్’’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో అండర్ వరల్డ్ మాఫియా, దానికి ఉగ్రవాదులు, పాక్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలను గురించి స్పష్టంగా చూపించింది. కరాచీలోని ల్యారీ ఏరియాలో ఏళ్ల తరబడి సాగిన గ్యాంగ్ వార్‌ను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రహమాన్ డకైత్ పాత్ర ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకప్పుడు, కరాచీని, పాక్ రాజకీయాలను శాసించిన అండర్ వరల్డ్ డాన్ డకైత్‌ను నిజజీవితంలో ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. 2009తో డకైత్‌ను అస్లాం ఎన్‌కౌంటర్ చేశారు. డకైత్‌కు నిజజీవితంలో పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ఆయన భార్య, పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి.

రెహమాన్‌ను లేపేసిన అస్లాం ఖాన్..

కరాచీలోని గ్యాంగ్ స్టర్లకు ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ సింహస్వప్నం. అనేక ఎన్‌కౌంటర్లలో చాలా మంది గ్యాంగ్‌స్టర్లను లేపేసిన చరిత్ర అస్లాంది. చివరకు ఇతడి చేతుల్లోనే రెహమాన్ డకైత్ హతమయ్యాడు. 2009లో డకైత్ తన ముగ్గురు సహచరులు అఖీల్ బలోచ్, ఔరంగజేబ్ బాబా, నజీర్ బాలా కలిసి రెండు కార్లలో కరాచీలోని కథోర్ పరిసర ప్రాంతంలోని లింక్ రోడ్లపై ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఈస్ట్ జోన్-2 ఇన్వెస్టిగేషన్ ఎస్ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ నేతృత్వంలోని ఒక పోలీసు బృందం స్టీల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే నేషనల్ హైవే సమీపంలో వారిని అడ్డగించడానికి ప్రయత్నించింది. ఈ సమయంలోనే డకైత్ గ్యాంగ్, పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య చాలా సేపు కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన గ్యాంగ్‌స్టర్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే మరణించాడు.

బూటకపు ఎన్‌కౌంటర్?

రెహమాన్‌ డకైత్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ అని అతడి భార్య సింధ్ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తను బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లు ఆమె ఆరోపించింది. తన భర్త, అతడి స్నేహితులతో కలిసి బిజినెస్ మీటింగ్ కోసం బలూచిస్తాన్ లోని టర్బట్‌కు వెళ్తున్నప్పుడు, ఆగస్టు 9, 2009న సాయంత్రం 5 నుంచి 5.30 గంటల ప్రాంతంలో కోస్టల్ం హైవేపై జీరో పాయింట్ సమీపంలో పోలీసులు వారిని ఆపారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. ఆ తర్వాత పోలీసులు వీరిని వేరే ప్రాంతంలోకి తీసుకెళ్లి హతమార్చినట్లు చెప్పింది. కొంతమంది రాజకీయ నాయకుడు, అధికారులు తన భర్త ఎదుగుదలను చూడలేక చంపించారని ఆమె ఆరోపించింది.

అనేక అనుమానాలు:

రెహమాన్ బలోచ్ యొక్క పీపుల్స్ అమన్ కమిటీకి చైర్మన్‌గా పనిచేసిన మౌలానా అబ్దుల్ మజీద్ సర్బాజీ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాడు. పోస్టుమార్టం నివేదికలో రెహమాన్ డకైత్‌ను మూడు అడుగుల దూరం నుంచే కాల్చి చంపారని, ఎన్‌కౌంటర్‌లో అలా చనిపోవడం అసాధారమని ఆయన అన్నాడు. ఇతడి హత్య వెనక బలూచ్ లిబరేషన్ ఆర్మీ హస్తం ఉందని కూడా అనుమానించిన వారు ఉన్నారు.

నిర్దోషిగా చౌదరి అస్లాం ఖాన్:

సింధ్ హైకోర్టు మొదట చౌదరి అస్లాం, మరో ఏడుగురు అధికారులను నిర్దోషులుగా ప్రకటించింది, తరువాత మూడవ విచారణ అధికారిని నియమించి, ఆరోపించిన హత్యకు సంబంధించి ఉన్నత పోలీసు అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. తీర్పు రాకముందే, చౌదరి అస్లాం 2014లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మరణించాడు, దీనికి పాకిస్తాన్ తాలిబన్లు బాధ్యత వహించారు.

Exit mobile version