ధనుష్ నటిస్తున్న ‘ఓం: చాప్టర్ 1’ టైటిల్ టీజర్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అడవిలో ఎర్రచందనం నరికే కార్మికులను కాపాడే వ్యక్తిగా ధనుష్ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. చేతిలో గొడ్డలితో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన ధనుష్… చాలా కాలం తర్వాత అభిమానులు కోరుకునే వింటేజ్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.
ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం కథ నేపథ్యం. సాధారణ కట్టెలు కొట్టుకునే కార్మికుడి జీవితం… అంతర్జాతీయ నేర సామ్రాజ్యంతో ఎలా ముడిపడిందనే పాయింట్ చుట్టూ కథ తిరగనున్నట్లు సమాచారం. 1980-90ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని, యాక్షన్‌తో పాటు ఎమోషన్, లవ్ స్టోరీ, క్రైమ్ ఎలిమెంట్స్‌ను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మిక్స్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ మమ్ముట్టి ఎంట్రీ. ‘కార్తికేయన్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌తో పాటు సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయిందని సమాచారం. ఇటీవల కర సినిమాతో మిక్స్‌డ్ రిజల్ట్ అందుకున్న ధనుష్… ఇప్పుడు ఓం: చాప్టర్ 1తో మరోసారి రిస్క్ తీసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌లో కాంతార, పుష్ప, KGF తరహా రస్టిక్ యూనివర్స్‌లకు మంచి డిమాండ్ ఉంది. అదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ… లోకల్ కథను గ్లోబల్ కాన్వాస్‌పై చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ధనుష్. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ధనుష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

