Demonte Colony 3 : ఈ మధ్య హారర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే ఏ భాషలో వచ్చినా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక వీటిలో భయాన్ని నిజంగానే అనుభవించేలా చేసే ఫ్రాంచైజీలు అంతకంటే ఎక్కువగా గుర్తుండిపోతున్నాయి. అలాంటి విజయవంతమైన హారర్ ఫ్రాంచైజీలలో ‘డెమోంటే కాలనీ’ ఒకటి. ఇప్పుడు మూడో భాగంతో మరోసారి ప్రేక్షకులను వణికించేందుకు సిద్ధమవుతోంది. అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డెమోంటే కాలనీ 3’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ హారర్ థ్రిల్లర్‌ను 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘చీకటికి సిద్ధంగా ఉండండి.. డెమోంటే కాలనీ 3 తలుపులు తెరుచుకోబోతున్నాయి’ అనే క్యాప్షన్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.
ఇక ఈ చిత్రానికి ‘కోబ్రా’ ఫేమ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. 2015లో విడుదలైన తొలి ‘డెమోంటే కాలనీ’ చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించింది. అతీంద్రియ శక్తులు, మిస్టరీ, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దెయ్యాలున్నాయని ప్రచారంలో ఉన్న ఒక భవనంలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల జీవితాల్లో చోటుచేసుకునే భయానక సంఘటనల చుట్టూ ఆ కథ తిరిగింది. ముఖ్యంగా జాన్ డెమోంటే అనే
వ్యక్తి చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ముంచెత్తింది.
ఆ విజయాన్ని కొనసాగిస్తూ 2024లో వచ్చిన ‘డెమోంటే కాలనీ 2: వెంజెన్స్ ఆఫ్ ది అన్‌హోలీ’ కూడా సూపర్ హిట్ అయింది. డెబ్బీ అనే మహిళ తన భర్త మరణం వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే క్రమంలో మొదటి భాగానికి కంటిన్యూగా ఈ కథ సాగుతుంది. మొదటి రెండు భాగాల్లో మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు రాబోతున్న ‘డెమోంటే కాలనీ 3’ ఉత్కంఠంగా ఇవ్వబోతోంది. ఇందులో అతీంద్రియ ప్రపంచాన్ని కొత్తకోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌తో పాటు రమేష్ తిలక్, సనంత్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, హెలెన్ టేలర్, సింగంపులి, ఎంఎస్ భాస్కర్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ ఆడియన్స్ ను ఏమాత్రం భయపెడుతుందో చూడాలి మరి.
Just the thought of this place will give you Shivers, thrills and nightmares 🥶💀
Brace yourself for the Darkness!!! The doors of #DemonteColony3 is about to open!!
Releasing worldwide on September 11 🔥@arulnithitamil @AjayGnanamuthu @priya_Bshankar @Sudhans2017… pic.twitter.com/MNKmI5uACZ
— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) June 22, 2026

