NTV Telugu Site icon

Dasarathi Krishnamacharyulu Jayanthi : మధురం పంచిన దాశరథి!

Krishna Machary

Krishna Machary

Dasarathi Krishnamacharyulu Jayanthi

‘నిజాము రాజు బూజు’ను వదలించి, ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ను పలికించిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. ‘అగ్నిధార’ కురిపించినా, ‘రుద్రవీణ’ వాయించినా, ‘తిమిరంతో సమరం’ చేసినా, ‘మహాంధ్రోదయం’ అభిలషించినా – ప్రతీ సందర్భంలోనూ దాశరథి తనదైన పదబంధాలతో సాహితీసేద్యం చేశారు. దాశరథి పండించిన సాహిత్యపు పంటలు తెలుగువారికి సంతృప్తి కలిగించాయి. ఆయన చిత్రసీమలో అడుగుపెడుతున్నారంటే, అభిమానుల ఆనందం అంబరమంటింది. అందుకు తగ్గట్టుగానే “ఖుషీ ఖుషీగా నవ్వుతూ…” దాశరథి కలం చిత్రసీమలో కాలు మోపింది. హుషారు పంచింది, బేజారును దూరం చేసింది. నిజాలను పలికించింది, జనం సజావుగా ఆలోచించేలా చేసింది. ఏది చేసినా దాశరథి కృష్ణమాచార్యుల గీతాలు తెలుగువారికి పరమానందం పంచాయని చెప్పక తప్పదు.

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్ జిల్లా చిన్నగూడురులో జన్మించారు. సమసమాజం కోసం తపించారు. ఛాందసం చుట్టూ ముసురుకున్నా, చైతన్యంతోనే సాగారు. వైష్ణవాన్ని ఒలికించారు, వైప్లవ్యం పలికించారు. దాంతో దాశరథి సాహిత్యంపై తెలుగునేలపైని ఎందరెందరో సాహితీప్రియులు మనసు పారేసుకున్నారు. అలాంటి వారందరికీ దాశరథి సాహిత్యం మదిలో వీణలు మ్రోగించింది. ఆ నాదం అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు మదినీ తాకింది. దాంతో తమ ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో ఓ పాట రాయమని, ఎర్రతివాచీ పరచి దాశరథిని ఆహ్వానించారు దుక్కిపాటి. ఆయన కలం పలికించిన తొలి సినిమా పాట, ‘ఇద్దరు మిత్రులు’లోని “ఖుషీ ఖుషీగా నవ్వుతూ…” అన్నదే! అయితే, ఆ తరువాత ఆచార్య ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో ‘వాగ్దానం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దాశరథితో “నా కంటి పాపలో నిలచిపోరా…” పాట రాయించారు. ‘ఇద్దరు మిత్రులు’ కంటే ‘వాగ్దానం’ ముందుగా జనాన్ని పలకిరించింది. ఆ పాటతోనే దాశరథి అభిమానగణం పులకించింది.

సినిమా రంగంలోనూ దాశరథి కలం వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగింది. పేరులోనే కృష్ణ శబ్దం ఉన్నందున కాబోలు దాశరథి కన్నయ్య పాటలతో జనం మదిని దోచారు. దాశరథి పేరు వినగానే ఈ నాటికీ ఆయన కలం పలికించిన కృష్ణ భక్తిగీతాలనే ముందుగు స్మరించుకొనేవారు ఎందరో ఉన్నారు. “రా రా క్రిష్ణయ్యా…రా రా క్రిష్ణయ్యా…” అంటూ యన్టీఆర్ ‘రాము’లో సాగిన దాశరథి పాట ఇప్పటికీ వేణుగోపాల స్వామి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. “కన్నయ్యా…నల్లని కన్నయ్యా…” (నాదీ ఆడజన్మే), “వేయి వేణువులు…మోగే వేళ…” (బుద్ధిమంతుడు),
“మనసే కోవెలగా…మమతలు మల్లెలుగా… నిన్నే కొలిచెదరా…కృష్ణా…” (మాతృదేవత), “పాడెద నీ నామమే… గోపాలా…” (అమాయకురాలు), “నడిరేయి ఏ జాములో…స్వామి నిను చేర దిగివచ్చునో…” (రంగులరాట్నం), “నీ దయ రాదా… రామా…” (పూజ) – ఇలా పాటల్లో వైష్ణవాన్ని రంగరించారు దాశరథి.
దాశరథి గీతాలను మననం చేసుకున్న ప్రతీసారి మధురం మన సొంతం కాక మానదు. భావితరాలను సైతం ప్రభావితం చేసే శక్తి దాశరథి సాహిత్యంలో దాగుంది. వెదకిన వారికి కోటి రతనాల వీణా నాదాలు వినిపిస్తాయి. వాటిని పదిల పరచుకున్న వారికి శతకోటి చైతన్య మార్గాలు కనిపిస్తాయి. అదీ దాశరథి సాహిత్యంలోని మహత్యం!

Show comments