NTV Telugu Site icon

Nandamuri Balakrishna : ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’

Thaman S

Thaman S

వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

విజయోత్సవ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ. అభివక్త ఆంధ్రప్రదేశ్ కి ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది రాయలసీమ. తెలుగుజాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఇది రాయలసీమ కాదు రాయల్ సీమ. డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తుంటాము. డాకు మహారాజ్ కోసం కూడా ఎంతో రీసెర్చ్ చేశాము. ఆదిత్య 369 లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచి డాకు మహారాజ్ పాత్ర పుట్టింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ అభిమానులకు నచ్చడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి. నా తండ్రి, గురువు, దైవం నందమూరి తారక రామారావు గారు నాకు అభిమానుల రూపంలో ఇంతటి కుటుంబాన్ని ఇచ్చారు. ఆయన బిడ్డగా పుట్టడం నా జన్మజన్మల పుణ్యఫలం. నేను సినిమా కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నా అభిమానులే నా ప్రచార కర్తలు. వాళ్లకు తెలుసు నా రికార్డులన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. దర్శకుడు బాబీ ఎంతో ప్రతిభావంతుడు. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. ఎంతో బాధ్యతగా అద్భుతమైన సంగీతం అందించాడు. మా కెమెరామ్యాన్ విజయ్ కార్తీక్ గారి విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. అలాంటి సినిమా డాకు మహారాజ్. మంచి సినిమాని ఆదరించి, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు మరోసారి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అన్నారు.