Site icon NTV Telugu

CM Pellam: ‘CM పెళ్లాం’ వచ్చేస్తోంది!

Cm Pellam

Cm Pellam

ఇంద్రజ మరియు అజయ్ జంటగా నటించిన చిత్రం CM పెళ్లాం. బొల్లా రామకృష్ణ రెడ్డి (బీఆర్‌కే) నిర్మాణంలో, గడ్డం రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

దర్శకుడు గడ్డం రమణారెడ్డి మాట్లాడుతూ… “ఒక ఎమ్మెల్యే సీఎం అవుతాడు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఆయన భార్య కూడా ఓట్లు అడుగుతుంది. కానీ, గెలిచిన తర్వాత ఎంతమంది ఓటర్లను కలుస్తారు? ఈ ప్రశ్నను సినిమా ద్వారా లేవనెత్తాను. ఈ చిత్రం తర్వాత అయినా ఇలాంటి సమావేశాలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాను. ఎమ్మెల్యే బిజీగా ఉండి బయట తిరుగుతున్నప్పుడు, ఆయన భార్య రెండు లేదా మూడు గంటలు ప్రజల సమస్యల కోసం వచ్చిన వారిని కలిస్తే చాలా మార్పులు వస్తాయని నమ్మాను. కేవలం కలవడం ద్వారానే మార్పు సాధ్యమని ఈ సినిమాలో చూపించాను. యువత గురించి కూడా ఈ చిత్రంలో ప్రస్తావించాను. గత ప్రెస్‌మీట్‌లో నేను ఒక పాటలో ‘హైడ్రాబాడ్ సిటీ’ అన్నానని వివాదం సృష్టించారు. నేను చెప్పింది హైదరాబాద్ బ్యాడ్ అని కాదు. సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ను ప్రవేశపెట్టారు. అది విజయవంతమైతే వర్షాల సమయంలో నగరం మునిగిపోకుండా ఉంటుంది. కరోనా సమయంలో మాస్క్‌లు చూశాం. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్ కంటే ఘోరమైనది బూతులు. రాజకీయ నాయకులు మీడియా ముందు బూతులు మాట్లాడకూడదనే అంశాన్ని ఈ సినిమా ద్వారా బయటపెడుతున్నాను. గవర్నమెంట్ జీఓలను ఆపిన హైకోర్టు, గవర్నర్‌కు ఒక వినతి పత్రం అందజేయబోతున్నాను. రాజకీయ నాయకులు మీడియా ముందు బూతులు మాట్లాడితే, ఐదేళ్ల పాటు రాజకీయాల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే నిబంధన రావాలని కోరబోతున్నాను. అలాగే, పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే అధికారం కోల్పోయే రూల్ రావాలి. ఇది రొటీన్ సినిమా కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఒక సందేశాన్ని అందించబోతున్నాం,” అన్నారు.

అజయ్ మాట్లాడుతూ “రమణారెడ్డి ఒక బౌండ్ స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. ఈ మధ్య కాలంలో బౌండ్ స్క్రిప్ట్‌లు పెద్దగా రావడం లేదు. నేను ఒప్పుకోవడానికి కారణం, ప్రీ-వర్క్ లేదా పోస్ట్-వర్క్ అన్నీ బౌండ్ స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉన్నాయి. ఇది సినిమా చేయడానికి నాకు మొదటి గ్రీన్ ఫ్లాగ్. కంటెంట్ మహిళా సాధికారత మీద ఉంది. రాజకీయంగా ఏ మార్పులు చేస్తే బాగుంటుందనే దానిపై ఈ సినిమా రూపొందింది. అది నచ్చి సినిమా చేశాను. నిర్మాత రామకృష్ణ గారు అవసరమైనంత ఖర్చు చేశారు. ఇంద్రజ గారితో దిక్కులు చూడకు రామయ్య తర్వాత మళ్లీ కలిసి పని చేయడం జరిగింది. జయసుధ గారు, సుమన్ గారు, శ్రీనివాస్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగమవడం చాలా సంతోషంగా ఉంది. మే 9న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మంచి సందేశంతో కూడిన ఈ సినిమాను అందరూ తప్పక చూడండి,” అన్నారు.

Exit mobile version