విజయ్ దేవరకొండ, రశ్మిక మరోసారి జోడీ కట్టనున్నారు. ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా అలరించిన వీరిద్దరూ ఇప్పుడు మూడోసారి కలసి నటిస్తున్నారు. అయితే ఈసారి వీరిద్దరూ కలసి నటిస్తున్నది ఓ కమర్షియల్ యాడ్ లో. సంతూర్ సోప్ కి వీరిద్దరూ బ్రాండ్అంబాసిడర్స్ గా వ్యవహరించబోతున్నారు. ఈ ప్రకటనను ఇటీవల ముంబైలో కోవిడ్ రూల్స్ కి అనుగుణంగా చిత్రీకరించారట. త్వరలో ఇది టీవీల్లో ప్రసారం కానుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ప్యాన్ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ చేస్తున్నాడు. ఇక రశ్మిక కూడా అల్లు అర్జున్ తో కలసి ప్యాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో నటిస్తోంది. అలాగే బిటౌన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మంజు’లో… అలాగే అమితాబ్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇంతకు ముందు వరుసగా రెండు సినిమాల్లో కలసి నటించగానే వచ్చిన రూమర్స్ తో కొంత కాలం కలసి నటించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ చెప్పాడు. రశ్మిక కూడా తామిద్దరి మధ్య ఉన్నది స్నేహం తప్ప వేరే ఏది కాదని స్పష్టం చేసింది. మరి ఇప్పుడు సంతూర్ వ్యాపార ప్రకటనతో జోడీ కట్టిన వీరిద్దరూ మళ్ళీ వెండితెరపై సందడి చేస్తారేమో చూద్దాం.
మరోసారి విజయ్ దేవరకొండ, రశ్మిక జోడీ

Vijay Devarakonda