Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్‌లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్‌తో విజయ్ ఆంటోనీ

Vijay Antoy Wife

Vijay Antoy Wife

ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఇంట జరిగిన విషాదం అందరినీ ఎంతగానో కలచివేసిన సంగతి తెలిసిందే. ఆయన గారాల పట్టి మీరా ఊహించని రీతిలో అర్థాంతరంగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టేసింది. ఆ చేదు ఘటన తర్వాత తొలిసారిగా.. దాదాపు 5 ఏళ్ల విరామం అనంతరం విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఓ బహిరంగ వేదికపై కనిపించారు. ఓ సినిమా కార్యక్రమానికి హాజరైన ఆమె.. తన కూతురి జ్ఞాపకాలను తలచుకుంటూ వేదికపైనే కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యంగా విజయ్ ఆంటోనీ గురించి ఆమె చెప్పిన ఓ విషయం అక్కడున్న వారందరి చేత కంటతడి పెట్టించింది. సాధారణంగా సెలబ్రిటీలు లక్షల రూపాయల విలువ చేసే బ్రాండెడ్ వాచ్‌లు వాడుతుంటారు. కానీ విజయ్ ఆంటోనీ మాత్రం ఎంతో ఖరీదైన తన స్మార్ట్ వాచ్ లన్నింటినీ పక్కన పడేశారు. ప్రస్తుతం ఆయన చేతికి కేవలం 3,900 రూపాయల విలువైన ఓ సాధారణ వాచ్ ఉంటోంది. దాని వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీని ఫాతిమా పంచుకున్నారు. “ఇప్పుడు ఆయన కట్టుకున్న వాచ్ మా మీరా ఉపయోగించినది. ఖరీదైన వాచ్ లన్నీ పక్కన పెట్టేసి, కేవలం మీరా జ్ఞాపకంగా దీన్నే ఎప్పుడూ ధరిస్తున్నారు. ఒకసారి నేను ఆయనతో.. ‘మీరు ఇంతకుముందు వాడిన స్మార్ట్ వాచ్ అయితే బీపీ, హార్ట్ రేట్ లాంటి ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు చూపిస్తుంది కదా’ అని అడిగాను. దానికి ఆయన బదులిస్తూ.. ‘ఇది నా మీరా వాచ్.. నా ఆరోగ్యాన్ని ఇకపై ఆమే దగ్గరుండి చూసుకుంటుంది’ అని చెప్పారు” అంటూ ఫాతిమా కన్నీటిపర్యంతమయ్యారు. కూతురిపై ఓ తండ్రికి ఉన్న ఈ అంతులేని ప్రేమ గురించి విన్న ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది.

మీరా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఫాతిమా మరింత ఉద్వేగానికి లోనయ్యారు. “నా మీరా కుట్టి ఎప్పుడూ ఒకే ఒక్క కమ్మ పెట్టుకునేది. ఆమెను కడసారి సాగనంపేటప్పుడు కూడా ఆ కమ్మను తీసేసి పంపాను. ఆమె వాడిన గది ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలతో అచ్చం అలాగే ఉంచాం. త్వరలోనే ఆమె కోరుకున్నట్లుగానే ఆ గదిని మా గదిగా మార్చుకోబోతున్నాం” అని వెల్లడించారు. ఎప్పుడూ చాలా సైలెంట్ గా కనిపించే విజయ్ ఆంటోనీలోని మరో కోణాన్ని కూడా ఆమె సభకు పరిచయం చేశారు. “బయటకు గంభీరంగా కనిపించే విజయ్ ఆంటోనీకి హాస్య చతురత చాలా ఎక్కువ. అయితే ఆ అల్లరి ఆయన కేవలం ఇంట్లోనే చూపిస్తారు. ఆయన చేసే అల్లరికి ఇంట్లో సెల్ ఫోన్లు, టీవీలు పగిలిపోతుంటాయి (నవ్వుతూ). ఇప్పుడు కొత్తవి కొందామంటే చేతిలో డబ్బుల్లేవు. ఈ సినిమా బాగా ఆడితేనే వాటిని కొనుక్కోవాలి. ఈ కష్టకాలంలో నన్ను, నా మరో కూతురిని ఆయనే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు” అని ఫాతిమా చెప్పుకొచ్చారు. “దాదాపు ఐదేళ్ల తర్వాత ఇలా ఓ వేదికపై మాట్లాడటం.. మళ్లీ మేమంతా ఒక కుటుంబంగా ఉన్నామన్న భావన కలిగిస్తోంది. మీరా.. నువ్వు ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించు” అంటూ బరువెక్కిన గుండెతో తన ప్రసంగాన్ని ముగించారు. చనిపోయిన కూతురిపై విజయ్ ఆంటోనీ చూపిస్తున్న ప్రేమ, ఫాతిమా ఉద్వేగభరితమైన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.