ప్రముఖ కథా రచయిత కాళీపట్నం పట్నం రామారావు (కారా మాస్టారు) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారా మాస్టారు శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలోని స్వర్గధామంలో కారా మాస్టారు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం నిర్వహించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. “తన అద్భుతమైన కథలతో… తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసి, తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రముఖ రచయత కాళీపట్నం రామారావుగారు మృతి చెందడం తెలుగు సాహితీ రంగంలో పూడ్చ లేని లోటు. కథానిలయం స్థాపించి తెలుగు కథకు ఆయన చేసిన సేవ అజరామరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
కారా మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ప్రముఖ కథా రచయిత, కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు చిరస్మరణీయులన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాస్టారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు కృష్ణదాస్.
