Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో

Vishnav Tej

Vishnav Tej

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత  వచ్చిన ‘కొండపొలం’, ‘రంగరంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో ఎలాగైనా సరే సాలిడ్ హిట్‌తో సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాలనే పట్టుదలతో ఈ యంగ్ హీరో కథల ఎంపికలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత మూడేళ్లలో వైష్ణవ్ ఏకంగా 100కు పైగా స్క్రిప్ట్‌లను రిజెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది.

ఎట్టకేలకు ఈ మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వైష్ణవ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఆల్మోస్ట్ ఒకే చేసారు. యువ దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన ఒక అద్భుతమైన లైన్ వైష్ణవ్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ వింటున్నంత సేపూ దర్శకుడి నరేషన్ శైలి ఈ యంగ్ హీరోను ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం. టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో బ్యాంక్రోల్ చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత 100 కథలు విని వైష్ణవ్ తేజ్ ఓకే చేసిన ప్రాజెక్ట్ కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

×
×
Ad