Aditi Sharma: కప్పు కాఫీ కోసం రోడ్డున పడ్డ సంసారం.. గృహహింస కేసు పెట్టిన బుల్లితెర నటి

Aditi Sharma (2)

Aditi Sharma (2)

Aditi Sharma: బాలీవుడ్ బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. చిన్న విషయంతో మొదలైన దాంపత్య కలహాలు చివరకు పోలీస్ కేసు వరకు వెళ్లాయి. భర్త, అత్త, ఆడపడుచుపై గృహహింసతో పాటు నగలు ఇవ్వకుండా వేధించారని ఆరోపిస్తూ ప్రముఖ టెలివిజన్ నటి అదితి శర్మ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ప్రేమతో మొదలైన బంధం ఇప్పుడు పరస్పర ఆరోపణలు, పోలీస్ కేసులతో చర్చనీయాంశమవుతోంది. ‘కలీరీన్’, ‘రబ్ సే హై దువా’, ‘అపోలోనా – సప్నోం కీ ఊంచీ ఉడాన్’, ‘ఖత్రోం కే ఖిలాడీ 14’ వంటి షోల ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన అదితి శర్మ, తన భర్త అభినీత్ కౌశిక్, అత్త ఊర్మిళా కౌశిక్, ఆడపడుచు కీర్తి కౌశిక్‌లపై ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదితి ఆరోపణల ప్రకారం, ఇంటి ఖర్చులకు సహకరించకుండా తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడం, మానసికంగా వేధించడం తరచూ జరిగేదట. అంతేకాదు పెళ్లి సమయంలో తనకు ఇచ్చిన బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, మంగళసూత్రం, గాజులు అత్త ఊర్మిళా కౌశిక్ వద్దే ఉంచుకుని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జూలై 31, 2026న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  IPCసెక్షన్ 85, సెక్షన్ 316(2),  సెక్షన్ 352 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, అదితి శర్మ, అభినీత్ కౌశిక్‌కు 2021లో ఆన్‌లైన్ యాక్టింగ్ కోర్స్ సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారి, 2024 సెప్టెంబర్‌లో ఇద్దరూ గోరేగావ్‌లో ఒకే ఇంట్లో నివసించడం ప్రారంభించారు. అనంతరం నవంబర్ 12, 2024న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. అయితే 2025 జనవరి 1న ఒక కప్పు కాఫీ విషయంలో జరిగిన చిన్న వాగ్వాదమే పెద్ద గొడవకు కారణమైందని అదితి పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత భర్త తనపై అనుమానాలు పెంచుకుని, తరచూ ఫోన్ చెక్ చేయడం, మానసిక ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడని తెలిపారు. పరిస్థితి మరింత దిగజారడంతో ఒకే గదిలో నిద్రపోవడం కూడా మానేశాడని ఆమె ఆరోపించారు. ప్రతి గొడవ సమయంలో తన తల్లి, సోదరిని పిలిపించి సమస్యను పరిష్కరించకుండా మరింత ఉద్రిక్తం చేసేవారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ దంపతుల మధ్య వివాదం కొత్తది కాదు. ఇప్పటికే 2025 మార్చిలో అభినీత్ కౌశిక్ మీడియా ముందుకు వచ్చి అదితిపై సంచలన ఆరోపణలు చేశారు. తన సహనటుడు సామర్థ్య గుప్తాతో అదితికి సంబంధం ఉందని, విడాకుల కోసం రూ.25 లక్షలు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. తమ వివాహాన్ని ఆమె నాటకంగా చూపిస్తోందని కూడా అన్నారు. అయితే ఆ సమయంలో అదితి బహిరంగంగా స్పందించలేదు. ప్రస్తుతం గోరేగావ్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ అమితా మరాఠే ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, నిందితుల నుంచి అధికారిక స్పందన కూడా రాలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ ఆరోపణలపై తుది నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.