Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్‌

Gandhari 300kb

Gandhari 300kb

Crime Thriller OTT: ఓటీటీలో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విడుదలైన వెంటనే ట్రెండింగ్ లో దూసుకెళ్తుంటాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో మిస్ అయినా, మంచి కథ ఉందనే టాక్ వస్తే ఇంట్లోనే కూర్చొని చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు తాప్సీ పన్ను నటించిన ‘గాంధారి’ కూడా అలాంటి దారిలోనే వెళ్తోంది. సెప్టెంబర్ 3న డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకటిగా నిలిచింది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో 

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన హై-ఇంటెన్సిటీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘గాంధారి’ (Gandhari) 2026 సెప్టెంబర్ 3న నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో, కనికా ధిల్లాన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన తన ఐదేళ్ల చిన్న కుమార్తెను రక్షించుకోవడానికి ఒక తల్లి (తాప్సీ) చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై ఒంటరిగా చేసిన పోరాటమే ఈ మూవీ కథాంశం. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళ, ఇంగ్లీష్ ఆడియోలతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన రోజు నుంచే  నెంబర్ 1 ట్రెండింగ్ లో నిలిచింది.

కథ

బాణి (తాప్సీ పన్ను), ఆమె భర్త గోకుల్ (ఇష్వాక్ సింగ్) ఒక రైలు ప్రయాణంలో ఉంటారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని ‘జాయ్‌పుర్రా’ అనే ఒక చిన్న రైల్వే స్టేషన్‌లో వారి ఐదేళ్ల చిన్న కుమార్తె మిష్టీని చీర కట్టుకున్న ఒక గుర్తుతెలియని వ్యక్తి హఠాత్తుగా అపహరిస్తాడు. కళ్లముందే పాపను కిడ్నాప్ చేయడంతో బాణి ఆ దొంగ వెనుక పరుగుతీస్తుంది. ఈ క్రమంలో కిడ్నాపర్లు ఆమెపై దారుణంగా దాడి చేస్తారు. ఆ దాడిలో తలకు గట్టిగా దెబ్బతగలడం వల్ల బాణి తన కంటి చూపును తాత్కాలికంగా కోల్పోతుంది. పోలీస్ ఆఫీసర్ (జతిన్ సర్నా) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, బాణి పోలీసులపైనే ఆధారపడకుండా కంటి చూపు లేకపోయినా తన కూతురి కోసం స్వయంగా వెతకడం ప్రారంభిస్తుంది.

ఈ క్రమంలో ఆ జాయ్‌పుర్రా పట్టణం వెనుక ఉన్న ఒక భయంకరమైన రహస్యం బయటపడుతుంది. అది కేవలం ఒక సాధారణ కిడ్నాప్ కాదు, అక్కడ అండర్‌గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా ‘బ్లాక్ హోల్’ అనే ఒక భారీ చైల్డ్ ట్రాఫికింగ్ (పిల్లల అక్రమ రవాణా) మాఫియా నెట్‌వర్క్ నడుస్తోందని ఆమె తెలుసుకుంటుంది. ఆ ఊరిలో రంగులు మార్చే ‘బహురూపిల’ వేషాల్లో తిరిగే జానపద కళాకారులే ఈ మాఫియాకు ముసుగుగా పనిచేస్తుంటారు. కంటి చూపు లేకపోయినా, కన్న కూతురి కోసం బాణి ఒక అజేయమైన శక్తిగా మారుతుంది. చివరికి తన లోపాన్ని అధిగమించి, తన కూతురితో పాటు మిగిలిన పిల్లలను కూడా బాణి ఎలా కాపాడుకుంది అనేదే ఈ క్లైమాక్స్.