NTV Telugu Site icon

రోజుకి 4-5 షిఫ్ట్‌లు పనిచేశా.. ‘రాబిన్‌హుడ్’ లాంటి ఫన్ ఎంటర్‌టైనర్ నా కెరీర్‌లో మొదటిది: శ్రీలీల

Sreeleela

Sreeleela

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న హైస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్‌హుడ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఉత్సాహాన్ని పెంచాయి. జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచాయి. మార్చి 28న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీలీల మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.

మీ పాత్ర గురించి చెప్పండి?
‘రాబిన్‌హుడ్’లో నా పాత్ర పేరు నీరా వాసుదేవ్. విదేశాల నుంచి భారత్‌కి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. తన సొంత ఊహా ప్రపంచంలో జీవిస్తూ, ఈ లోకమంతా తన చుట్టూ తిరుగుతుందని భావించే అమ్మాయి ఈమె. చాలా చలాకీగా, ఆకర్షణీయంగా ఉంటుంది ఈ క్యారెక్టర్. అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

మొదట ఈ పాత్ర కోసం రష్మికను అనుకున్నారని విన్నాం. మీరు ఈ సినిమాలోకి ఎలా వచ్చారు?
నా చదువు కోసం కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్న సమయంలో వెంకీ గారు సంప్రదించారు. ఈ పాత్ర రష్మిక గారికి చాలా ఇష్టమైనది కాగా, షెడ్యూల్ సమస్యల వల్ల ఆమె చేయలేకపోయారు. ‘పుష్ప’ షూటింగ్ సమయంలో ఆమె నాకు శుభాకాంక్షలు తెలిపారు. నాకూ ఈ క్యారెక్టర్ బాగా నచ్చడంతో చేశాను.

నితిన్‌తో మళ్లీ కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
నితిన్ గారితో వర్క్ చేయడం చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఆయన చాలా ప్రశాంతంగా, కుటుంబస్థుడిలా ఉంటారు. ఈ సినిమాపై టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉంది. మాకు సమయం బాగా దొరికింది కాబట్టి, అద్భుతమైన నాణ్యతతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇది హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. నితిన్ గారితో నా జోడీ హిట్ పెయిర్‌గా మారుతుందని ఆశిస్తున్నాను.

వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ గురించి?
వెన్నెల కిషోర్ గారు, రాజేంద్రప్రసాద్ గారి ఎపిసోడ్‌లు షూటింగ్ సమయంలోనే మమ్మల్ని బాగా నవ్వించాయి. వెన్నెల కిషోర్ గారి కామెడీ అద్భుతంగా ఉంటుంది. మా ఇద్దరి సన్నివేశాలు కూడా హాస్యాత్మకంగా ఉంటాయి. ఇటీవల సినిమా చూసినప్పుడు కూడా చాలా ఆనందించాం. రాజేంద్రప్రసాద్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో వారి కామెడీ అదిరిపోతుంది.

ఈ సినిమా గురించి మీ అభిప్రాయం?
నా కెరీర్‌లో ఇంత హాస్యం నిండిన సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఇది నాకు పూర్తి ఫన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే చిత్రం అవుతుంది. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను.

మైత్రి మూవీ మేకర్స్‌తో అనుభవం?
మైత్రి బ్యానర్‌లో భాగమవడం గర్వంగా ఉంది. వారితో పనిచేయడం సంతోషంగా అనిపిస్తుంది. చాలా అద్భుతమైన నిర్మాతలు వారు. సెట్‌లో ఇంట్లో ఉన్నట్టు హాయిగా చూసుకుంటారు.

వరుస సినిమాల తర్వాత ఏడాది విరామం ఎందుకు?
గత ఏడాది నా నుంచి దాదాపు ప్రతి నెలా ఒక సినిమా విడుదలైంది. రోజుకి 4-5 షిఫ్ట్‌లు పనిచేశాను. నా చదువు కోసం ఈ విరామం ప్లాన్ చేశాను. ఫైనల్ ఇయర్ మెడిసిన్ పూర్తయింది. కాలేజీ నిబంధనల ప్రకారం కొంత అటెండెన్స్ కోసం వెళ్తున్నాను. ఈ గ్యాప్‌లో కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయాను.

‘భగవంత్ కేసరి’ తర్వాత మీ పాత్రల్లో మార్పులు ఉంటాయని ఆశించాం. భవిష్యత్తులో అలాంటి పాత్రలు చేస్తారా?
తప్పకుండా. ‘భగవంత్ కేసరి’లో విజ్జి పాప పాత్ర తర్వాత అందరూ ఆ పేరుతో పిలవడం ఆనందంగా ఉంది. అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. కమర్షియల్ సినిమాలతో పాటు సందేశాత్మక కథలు కూడా చేయాలనుకుంటున్నాను.

బాలీవుడ్‌లో కనిపిస్తే అక్కడికి షిఫ్ట్ అవుతున్నారనే చర్చ జరుగుతోంది?
తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు. బాలీవుడ్‌కి వెళ్లడం అసాధ్యం.

కొత్త సినిమాల గురించి?
‘పరాశక్తి’, రవితేజ గారితో ‘మాస్ జాతర’, కన్నడ-తెలుగులో ‘జూనియర్’ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. నిర్మాతలు త్వరలో ప్రకటిస్తారు.