ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈసారి విషయం మరీ హద్దులు దాటింది. తనపై మాత్రమే కాకుండా తన పిల్లలపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్రోలర్లు దూషించారని చిన్మయి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె తెలిపిన ప్రకారం.. ట్రోలర్స్ తన పిల్లలు చనిపోవాలని కోరుతూ అనుచితమైన మాటలు వాడారని, ఇది తాను భరించలేనిదిగా, ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తూ తాను రాయడానికి వీలు లేని పదాలతో వేధింపులకు గురిచేస్తున్నారని.. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఆన్‌లైన్ ద్వారా చిన్మయి ఫిర్యాదు చేశారు.
Also Read : Keerthy Suresh : పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన కీర్తి – కొత్త యాక్షన్ చిత్రం ప్రకటించిన బ్యూటీ
ఇక ఈ ట్రోలింగ్ కారణం ఏమిటంటే.. ఇటీవల చిన్మయి భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు మంగళసూత్రం గురించి చేసిన వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ – “మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య నిర్ణయం. నేను ఫోర్స్ చేయను” అని చెప్పారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు చిన్మయి దంపతులపై ట్రోలింగ్ ప్రారంభించారు. అయితే గతంలో కూడా చిన్మయి అనేకసార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. అయితే ఈసారి తన పిల్లలను కూడా లాగడంతో చిన్మయి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలోనే కాకుండా న్యాయపరంగా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇక ఈ ఘటనపై నెటిజన్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు చిన్మయిని సపోర్ట్ చేస్తూ, “ఎవరూ ఒక తల్లిని, ఆమె పిల్లలను ఇలా దూషించకూడదు” అంటుంటే, మరికొందరు మాత్రం “పబ్లిక్ ప్లాట్‌ఫాంలో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి” అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, చిన్మయి చేసిన ఈ ఫిర్యాదు మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ పరిమితులపై చర్చను తెరపైకి తెచ్చింది.
