Site icon NTV Telugu

Shine Tom Chako: షాకింగ్.. డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్

Whatsapp Image 2025 04 19 At 15.47.18 438777f8

Whatsapp Image 2025 04 19 At 15.47.18 438777f8

మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొచ్చి నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ రైడ్ సందర్భంగా పోలీసుల నుంచి పారిపోయిన ఘటనతో ఆయనపై అనుమానాలు మొదలయ్యాయి. సహనటి విన్సీ అలోషియస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, డ్రగ్స్ మత్తులో తనపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చాకోను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం విచారణ అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.

Delhi: బాలుడి హత్య కేసులో లేడీడాన్ జిక్రా అరెస్ట్.. ఆమె ఎవరంటే..!

అనుకోకుండా అనుమానం
ఏప్రిల్ 16 రాత్రి, కొచ్చిలోని కలూర్‌లో ఉన్న ఓ హోటల్‌లో డిస్ట్రిక్ట్ యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ (DANSAF) బృందం డ్రగ్స్ కేసులో ఓ నిందితుడి కోసం రైడ్ చేసింది. ఆ సమయంలో హోటల్ రిజిస్టర్‌లో షైన్ టామ్ చాకో పేరు కనిపించడంతో, పోలీసులు ఆయన మూడో అంతస్తులోని గదికి వెళ్లారు. అయితే, పోలీసుల రాకను గమనించిన చాకో, గది కిటికీ గుండా రెండో అంతస్తుకు దూకి, అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటన మొత్తం హోటల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని హోటల్ గదిలో ఎలాంటి డ్రగ్స్ లభించకపోవడంతో అప్పటికి ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయితే, చాకో ఎందుకు పారిపోయారనే విషయంపై పోలీసులు ఆరా తీయగా, ఆయన డ్రగ్స్ వాడినట్లు విచారణలో అంగీకరించారని అధికారులు తెలిపారు. దీంతో, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని సెక్షన్ 27బి, 29 కింద, అలాగే ఆధారాలను నాశనం చేసినందుకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 238 కింద కేసు నమోదు చేశారు.

ఫిర్యాదుతో వెలుగులోకి
ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు, నటి విన్సీ అలోషియస్, చాకోపై సంచలన ఆరోపణలు చేశారు. వారు కలిసి నటిస్తున్న ‘సూత్రవాక్యం’ సినిమా సెట్‌లో చాకో డ్రగ్స్ మత్తులో తనపై అనుచితంగా ప్రవర్తించారని, తన నోటిలో తెల్లటి పొడి ఉన్నట్లు గమనించినట్లు ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదును ఆమె అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) మరియు కేరళ ఫిల్మ్ ఛాంబర్‌కు సమర్పించారు. ఈ ఆరోపణలు చాకోపై మరింత ఒత్తిడిని పెంచాయి. AMMA సంస్థ విన్సీకి మద్దతు ప్రకటించగా, ఫిల్మ్ ఛాంబర్ ఈ విషయంపై ఏప్రిల్ 21న అత్యవసర సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

మొన్నే నిర్దోషిగా తేలి మళ్ళీ అరెస్ట్
నిజానికి షైన్ టామ్ చాకో గతంలో 2015లో కూడా డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. కొచ్చిలోని కడవంత్రలో ఓ ఫ్లాట్‌లో 7 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, చాకోతో పాటు నలుగురు మహిళలను అరెస్టు చేశారు. అయితే, సీజర్ ప్రక్రియలో లోపాలు, ఆధారాలు సరిగా సమర్పించకపోవడంతో 2025 ఫిబ్రవరిలోనే ఎర్నాకుళం అడిషనల్ సెషన్స్ కోర్టు చాకో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

Exit mobile version