సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. సీనియర్ నటులు మురళీ మోహన్, నిర్మాత కేఎస్ రామారావు, ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఫంక్షన్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో సంతోషం మేగజైన్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ 2002లో ఫస్ట్ సంతోషం ఈవెంట్ లో నాగార్జున ఫిలింఫేర్ అవార్డ్స్ లా సంతోషం అవార్డ్స్ పేరు తెచ్చుకోవాలి అన్నారు. ఆయన మాట మీద నేను కనీసం 25 ఏళ్లు ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇది 24వ సంవత్సరం.
మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయగలుగుతున్నా. 2007లో దుబాయ్ షార్జా క్రికెట్ స్టేడియంలో 40 వేల మంది మధ్య సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా చేశాం. ఇక్కడి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు సహా 120 మందిని ఎమిరేట్స్ ఫ్లైట్ లో షార్జా తీసుకెళ్లి ఫంక్షన్ చేశాం. అలాంటిది మొన్న గోవాలో చిన్న చిన్న పొరపాటు జరిగితే దాన్ని కొందరు కావాలని ఇష్యూ చేశారు. నా మేగజైన్ లో ఇన్నేళ్లలో ఒక్కరి గురించి కూడా తప్పుగా రాయలేదు. నాకు తెలిసి నేను చిత్ర పరిశ్రమలో ఎలాంటి తప్పు చేయలేదు. అవార్డ్స్ ఫంక్షన్ అంటే ముళ్ల కిరీటం లాంటిది. అవార్డు ఫంక్షన్స్ వద్దు అని అక్కినేని నాగేశ్వరరావు గారి లాంటి లెజెండ్స్ నాకు సలహా ఇచ్చేవారు. కానీ పట్టుదలగా చేస్తూ వచ్చాను. గోవా ఈవెంట్ కు సౌత్ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి పెద్ద సంఖ్యలో గెస్ట్ లను తీసుకెళ్లాను. అక్కడ రూమ్స్ విషయంలో చిన్న పొరపాటు జరిగింది అంతే. దీని గురించి ఇప్పటిదాకా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఏదైనా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువ కాంట్రవర్సీ అవుతుందనే ఊరుకున్నా అన్నారు.
