సినీ పరిశ్రమలో పండుగ సీజన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద సినిమాల హోరాహోరీ పోరు సహజం. అందులోనూ తెలుగు వారికి పెద్ద పండుగ అయిన ‘సంక్రాంతి’ బరిలో నిలవాలని ప్రతి హీరో, ప్రతి నిర్మాణ సంస్థ ఆశిస్తాయి. సినిమా షూటింగ్ సరిగ్గా ప్రారంభం కాకముందే విడుదలకు సంక్రాంతి స్లాట్‌ను ఖరారు చేసుకోవడం టాలీవుడ్‌లో ఒక ఆనవాయితీగా మారింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే కొత్త చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలపడంతో రేసు మారిపోయింది.
దర్శకుడు బాబీ కొల్లి నేతృత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 158వ చిత్రానికి ‘కాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా 3 నిమిషాల నిడివితో కూడిన మాస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అయితే వారం రోజుల క్రితమే మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తన పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ను జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘హను-మాన్’ మ్యాజిక్ రిపీట్ చేసిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ అదే జనవరి 12 సెంటిమెంట్‌తో ఈ తేదిని ఫిక్స్ చేసుకుంది. ఇప్పుడు మావయ్య జనవరి 13న తన డేట్‌ను ఖరారు చేయడంతో ఒక రోజు వ్యవధిలోనే మెగా హీరోలిద్దరి సినిమాలు థియేటర్లలోకి రావలసి వస్తోంది. దీనితో బాక్సాఫీస్ వద్ద థియేటర్ల సర్దుబాటు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి మావయ్య సినిమా వస్తుండడంతో మేనల్లుడు ఆగుతాడా లేదా బరిలో దిగుతాడా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

